చ‌ట్ట‌ప‌ర‌మైన అబార్ష‌న్‌కు మ‌హిళ‌లు ఎవ‌రైనా అర్హులే

గ‌ర్భాన్ని తొల‌గించుకునేందుకు మ‌హిళ‌లు వివాహితులై ఉండాల్సిన నియ‌మం ఏమీ లేద‌ని సుప్రీం కోర్ట్ కీలకమైన తీర్పు ఇచ్చింది. సుర‌క్షిత‌మైన‌, చ‌ట్ట‌ప‌ర‌మైన అబార్ష‌న్‌కు మ‌హిళ‌లు ఎవ‌రైనా అర్హులే అని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. మెడిక‌ల్ ప్రెగ్నెన్సీ చ‌ట్టం ప్ర‌కారం  ఒంట‌రి, అవివాహిత మ‌హిళ‌లు కూడా అబార్ష‌న్ చేసుకునే హ‌క్కు ఉంద‌ని కోర్టు తెలిపింది. 

కానీ నిబంధనల ప్ర‌కారం 24 వారాల‌ గ‌ర్భాన్ని మాత్ర‌మే తొల‌గించుకునే అవ‌కాశం ఉంద‌ని సుప్రీం వెల్ల‌డించింది. వివాహితుల అత్యాచారం విష‌యంలోనూ ప్రెగ్నెన్సీ యాక్ట్ వ‌ర్తిస్తుంద‌ని కోర్టు తెలిపింది. వివాహిత మ‌హిళ‌లు, అవివాహిత మ‌హిళ‌ల మ‌ధ్య తేడాను చూడ‌డం కృత్రిమం అవుతుంద‌ని, అది రాజ్యాంగ వ్య‌తిరేకం కూడా అవుతుంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. 

కేవ‌లం పెళ్లి చేసుకున్న మ‌హిళ‌లు మాత్ర‌మే శృంగారంలో పాల్గొంటార‌న్న వాద‌న‌ను కూడా బ‌ల‌ప‌రుస్తుంద‌ని కోర్టు తెలిపింది. జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, ఏఎస్ బొప్ప‌న్న‌, జేబీ ప‌ర్దివాలాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం అబార్ష‌న్ అంశంపై విచార‌ణ చేప‌ట్టింది. అవివాహిత మ‌హిళ 20 వారాల త‌ర్వాత గ‌ర్భాన్ని తొల‌గించ‌రాద‌న్న నియ‌మం స‌రైంది కాదు అని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది.

ఒక‌వేళ అలా నియంత్రిస్తే, అది రాజ్యాంగంలోని 14వ ఆర్టిక‌ల్‌ను ఉల్లంఘించిన‌ట్లే అవుతుంద‌ని కోర్టు తెలిపింది. మెడిక‌ల్ ట‌ర్మినేష‌న‌ల్‌లోని రూల్ 3బీ(సీ ) కేవ‌లం వివాహిత మ‌హిళ‌ల‌కే వ‌ర్తిస్తే, అప్పుడు అవివాహితులు సెక్స్‌లో పాల్గొన‌డం లేద‌న్న అర్థం వ‌స్తుంద‌ని కోర్టు తెలిపింది. దీంతో వివాహితులు, అవివాహితుల మ‌ధ్య కృత్రిమ భేదాన్ని సృష్టించ‌డం క‌రెక్ట్ కాదు అని కోర్టు చెప్పింది.

 భార్య సమ్మతి లేకుండా భర్త ఆమెతో బలవంతంగా కలిస్తే అది కూడా అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది  బలవంతపు గర్భధారణ కిందకు వస్తుందని తెలిపింది.  ఇలాంటి గర్భధారణల నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  ఎంటిపి  చట్టంలో అత్యాచారానికి అర్థంలో వైవాహిక అత్యాచారాన్ని కూడా చేర్చాల్సిన అవసరముందని తెలిపింది.  

మైన‌ర్లు, రేప్ బాధితులు, గ‌ర్భ స‌మ‌స్య‌లు ఉన్న‌వాళ్లు త‌మ ప్రెగ్నెన్సీని 24 వారాల వ‌ర‌కు ట‌ర్మినేట్ చేసే అవ‌కాశం ఉంది. కానీ ఇష్ట‌పూర్వకంగా శృంగారం పాల్గొన్న వారి కేసుల్లో మాత్ర‌మే ఆ నియ‌మం 20 వారాలు మాత్ర‌మే ఉంది. ఈ తేడా ఉండ‌రాదు అని కోర్టు ఇవాళ అభిప్రాయ‌ప‌డింది. మ‌ణిపూర్‌కు చెందిన ఓ మ‌హిళ దాఖ‌లు చేసిన కేసులో సుప్రీం ఈ తీర్పునిచ్చింది.