పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, అనుబంధ సంస్థలపై దేశవ్యాప్త నిషేధం

ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు దాని అనుబంధ సంస్థలపై దేశవ్యాప్త నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, ఐదేళ్లపాటు నిషేధం కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967లోని సెక్షన్ 3(1) క్రింద కలిగే అధికారాలను వినియోగించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ తెలియజేసింది.

ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను అందించడంతో పాటు ముస్లిం యువతకు ఆయుధాల శిక్షణ ఇస్తున్న నేపథ్యంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)  కార్యాలయాలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని జాతీయ దర్యాప్తు సంస్థ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో అనేక మంది పీఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు.