ఇక ఆరు నెలల్లోనే గ్రీన్‌కార్డుల జారీ

అమెరికాలో శాశ్వత నివాసయోగ్యతకు వీలు కల్పించే గ్రీన్‌కార్డుల జారీ నిర్ణయ కాలాన్ని తగ్గించాలనే సిఫార్సులపై వైట్‌హౌస్ అధికార వర్గాలు పరిశీలన జరుపుతున్నాయి. గ్రీన్‌కార్డుల నిర్ణయంలో జాప్యం, దరఖాస్తుల పరిశీలనలో జాప్యాన్ని తగ్గించాలని ఇటీవలే ప్రెసిడెన్షియల్ కమిషన్ సిఫార్సులు వెలువరించింది. గ్రీన్‌కార్డుల కోసం అభ్యర్థిత్వాల వెల్లువ ప్రత్యేకించి భారత్ , ఇతర ఆసియా దేశాల నుంచి ఎక్కువగా ఉంటోంది.

గ్రీన్‌కార్డుల జారీకి, దరఖాస్తుల పరిశీలనకు గడువును కేవలం 6 నెలలుగా ఖరారు చేయాలని ప్రతిపాదన వెలువడింది. ఇక పేరుకుపోయిన గ్రీన్‌కార్డుల అంశం పరిష్కారాన్ని అంటే బ్యాక్‌లాగ్‌ల విషయాన్ని 2023 ఎప్రిల్ నాటికి పూర్తి చేయాలని కూడా ప్రెసిడెన్షియల్ కమిషన్ ప్రధాన సిఫార్సు చేసింది. దేశంలో ప్రతిభాయుత ఉద్యోగ వనరులకు ప్రతిబంధకం అవుతోన్న ఈ గ్రీన్‌కార్డు జారీల జాప్యం పరిష్కారానికి దేశాధ్యక్షులు స్పందించి కమిషన్ ఏర్పాటు చేశారు.

త్వరితగతిన గ్రీన్‌కార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటే, సిఫార్సులు అమలులోకి వస్తే వందలు వేలాది మంది వలసదార్లకు,  ప్రత్యేకించి అత్యధికంగా భారతీయులు చైనా వారికి ప్రయోజనం సమకూరుతుంది. ఆసియన్ అమెరికన్లు, స్థానిక హవాయియన్లు, పసిఫిక్ దీవులకు చెందిన వారి విషయాలను పరిశీలించేందుకు ప్రెసిడెంట్ సలహా సంఘం ఏర్పాటు అయింది.

మరోవంక, వర్క్ పర్మిట్ హోల్డర్లకు ప్రస్తుత బ్యాక్‌లాగ్‌తో అమెరికా విడిచిపెట్టాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టారు. ఇప్పుడు వర్క్‌పర్మిట్‌పై ఉన్నవారి అధీకృత పని గడువు ముగిస్తే రిన్యూవల్స్‌కు దరఖాస్తు చేసుకునే వారికి ఇప్పటివరకూ వెనువెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగింపు ప్రక్రియ ఉంది. అయితే ఈ వెసులుబాట్ల పరిమితిని ఇకపై వర్క్ పర్మిట్‌దార్లకు 365 రోజులకు పెంచాలని కమిషన్ సిఫార్సు చేసింది.

ఇక వర్క్ పర్మిట్‌హోల్డర్లకు అంటే తాత్కాలిక ఉద్యోగాల అవకాశానికి వీలయ్యే హెచ్ 1బి, హెచ్ 2 ఎ వీసాలపై నిర్ణయానికి సమయాన్ని కేవలం రెండు నెలలుగానే ఖరారు చేయాలని సిఫార్సు వెలువరించారు.

సిలికాన్ వ్యాలీకి చెందిన భారతీయ సంతతి అమెరికా పారిశ్రామికవేత్త అజయ్ జైన్ భూటోరియా ఈ గ్రీన్‌కార్డుల జారీలో జాప్యం నివారణకు చొరవ చూపారు. బైడెన్ ఎన్నికల ప్రచారం తొలిరోజు నుంచి కూడా జైన్ బైడెన్ విజయానికి అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునే యత్నాలు చేపట్టారు. బైడెన్ ఎన్నిక అయిన తరువాత ఈ గ్రాన్‌కార్డుల విషయం గురించి తనకు అందిన వివిధ స్థాయిల సమాచారాన్ని క్రోడీకరించుకుని బైడెన్ పరిశీలనకు అభ్యర్థన పంపించారు.