25 వేల పోలింగ్ బూత్ లలో 55 వేల మొక్కలు నాటిన బీజేపీ

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 106వ జయంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. రాష్ట్రంలోని సుమారు 25 వేల పోలింగ్ బూత్ లలో 55 వేల మొక్కలు నాటారు.
 
కేంద్ర పర్యాటక, సాంస్క్రతిక వ్యవహారాల మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ నల్గొండ జిల్లాలో మొక్కలు నాటారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని 57వ డివిజన్ లో జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నార్సింగ్ లోని ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు.
 
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు దేశవ్యాప్తంగా ‘‘సేవా పక్వాడ’’ పేరుతో బీజేపీ చేబడుతున్న విస్త్రత సేవా కార్యక్రమాలలో భాగంగా రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, దివ్యాంగులకు పరికరాల పంపిణీ, చెరువుల శుద్దీకరణ వంటి పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

దీన్ దయాల్ ఉపాధ్యాయ గొప్ప రాజనీతిజ్ఞుడు

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గొప్ప దేశభక్తుడని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. మల్కాజిగిరి ఆనంద్ బాగ్ లోని బృందావన్ గార్డెన్ లో దీన్ దయాల్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ దీన్ దయాల్ ఉపాధ్యాయ అతి సామాన్య కుటుంబంలో పుట్టి గొప్ప వ్యక్తిగా ఎదిగారని తెలిపారు. స్కాలర్ షిప్ తో చదివి అపర మేధావిగా పేరు తెచ్చుకున్నారని అంటూ  దీన్ దయాల్ లో ఒక చరిత్రకారుడు, రచయిత, రాజనీతిజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఉన్నారని చెప్పారు.
 
భారతీయ సంస్కృతిని లోతుగా అధ్యయనం చేసిన వాళ్లలో దీన్ దయాల్ ఉపాధ్యాయ ఒకరని పేర్కొంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, జన్ సంఘ్ పార్టీ కార్యదర్శిగా దీన్ దయాల్ సేవలు మరువలేనివని తెలిపారు.  బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అఖండ భారత్ కోసం ఎంతో కృషి చేశారని, దేశ విభజన వెనుక ఉన్న కుట్రలను వేలెత్తి చూపారని తెలిపారు.