చైనాలో సైనిక తిరుగుబాటు.. జిన్‌పింగ్‌ గృహ నిర్బంధం?

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (69)ను ఆ దేశ సైన్యం గృహనిర్బంధంలో ఉంచిందా? పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) ఇంచార్జి బాధ్యతల నుంచి కూడా తప్పించిందా? అంటే అవునంటూ పాశ్చాత్య మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్నది. చైనా సైన్యం జిన్‌పింగ్‌ను హౌజ్‌ అరెస్టు చేసిందని, పీఎల్‌ఏ బాధ్యతల నుంచి తప్పించిందని వార్తలు వస్తున్నాయి.

ట్విట్టర్‌లోనూ పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. అయితే, వీటిని చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ ధ్రువీకరించలేదు. ఏ అంతర్జాతీయ మీడియా కూడా ఈ కథనాలను ధ్రువీకరించలేదు.  చైనీస్‌ ఆర్మీ జనరల్‌గా ఉన్న లీ కియోమింగ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నదని ప్రచారం సాగుతున్నది. ఈయన ప్రస్తుతం చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీలో సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

మరోవైపు గత గురువారం చైనా సైన్యానికి చెందిన భారీ కాన్వాయ్‌ దేశ రాజధాని బీజింగ్‌ దిశగా సాగుతున్నదని ప్రవాసంలో ఉంటున్న చైనా మానవ హక్కుల కార్యకర్త జెన్నిఫర్‌ జెంగ్‌ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దాదాపు 80 కిలోమీటర్ల పొడవున సైనిక వాహనాలు బీజింగ్‌ వైపు వెళ్తున్నాయని తెలిపారు.

షాంఘై సహకార సమాఖ్య (ఎస్‌సీవో) సమావేశాల్లో పాల్గొనేందుకు జిన్‌పింగ్‌ ఇటీవల సమర్‌ఖండ్‌ వెళ్లారు. ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీలోని ఆయన వ్యతిరేకులు జిన్‌పింగ్‌ను సైన్యాధినేత బాధ్యతల నుంచి తప్పించారని, తిరిగి 16న స్వదేశం రాగానే గృహ నిర్బంధంలో ఉంచారని వార్తలు వెలువడ్డాయి.

మరో వార్త కూడా ప్రచారంలో ఉన్నది. అదేమిటంటే జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన కొందరు సైనిక జనరళ్లకు ఇటీవల కోర్టు జీవితకాల కారాగార శిక్ష విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ సైన్యమే జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచిందని అంటున్నారు.  అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చైనాలో ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్ష పడింది. నలుగురు అధికారుకుల జీవిత ఖైదు విధించారు. వీరంతా పింగ్‌కు ప్రత్యర్థులని ప్రచారం ఉంది. మరణశిక్షకు గురైనవారిలో న్యాయ శాఖ మాజీ మంత్రి ఫు జెంగ్‌ హువా, వాంగ్‌లైక్‌ ఉన్నారు.

వ్యాపారం, పదవులు, కేసుల్లో కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చారని.. దీనికి ప్రతిగా రూ.139 కోట్లు పొందరాని ఫు మీద అభియోగాలున్నాయి. ప్రస్తుతం చైనా కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తోంది. ఇదే సమయంలో జిన్‌ పింగ్‌ ప్రత్యర్థులకు ‘శిక్షలు పడడం’ చర్చనీయాంశమైంది.

ఉజ్బెకిస్థాన్‌లో షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సు ముగించుకొని జిన్‌పింగ్‌ విమానం బీజింగ్‌లో దిగగానే ఆయనను హౌజ్‌ అరెస్టు చేసినట్టు ప్రచారం సాగుతున్నది. ప్రణాళికలో భాగంగానే  జిన్‌పింగ్‌కు మోదీ, పుతిన్‌తో సమావేశాలను షెడ్యూల్‌ చేయలేదని తెలిసింది. చైనా నుంచి విదేశాలకు వెళ్లాల్సిన దాదాపు 60 శాతం విమానాలను శుక్రవారం నిరవధికంగా నిలిపేశారు. 9,583 దేశీయ, అంతర్జాతీయ విమానాలు, పలు హైస్పీడ్‌ రైళ్లు రద్దయినట్టు సమాచారం. అందుకు కారణాలను అధికారులు చెప్పటంలేదు.

చైనీయులు కూడా జిన్‌పింగ్‌ ఖేల్‌ ఖతం అంటూ ట్వీట్లు చేస్తున్నా.. ఎవరివద్దా నిర్దిష్ట సమాచారం లేదు. చైనాలో ప్రస్తుతం దేశీయ విమానాలు మాత్రమే అదీ తక్కువ సంఖ్యలో తిరుగుతున్నట్లు.. ‘ఫ్లైట్‌ రాడార్‌’ చూపుతోంది.

జిన్‌పింగ్‌ హౌస్‌ అరెస్టు వార్తలపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కూడా స్పందిస్తూ చైనాలో ఏం జరుగుతున్నది? జిన్‌పింగ్‌ హౌస్‌ అరెస్టు అయినట్టు వార్తలు వస్తున్నాయి.. నిజమేనా? అని ట్వీట్‌ చేశారు. చైనాలో భారీగా మంటలు చెలరేగుతున్నందుకే ఇంతలా పొగ వస్తున్నదని అమెరికాలో ప్రవాసం ఉంటున్న చైనా రచయిత గోర్డన్‌ చాంగ్‌ ట్వీట్‌ చేశారు. చైనా ఇప్పుడు సుస్థిరంగా లేదని పేర్కొన్నారు.

ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఎస్సీవో సదస్సులో జిన్‌ పింగ్‌ ముభావంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కరోనా జాగ్రత్తలంటూ ఇతర నాయకులతో కలిసి ఆయన భోజనం చేయలేదు.