ఉగ్రవాదులతో పీఎఫ్ఐ సంబంధాలు వెల్లడి చేసిన ఎన్ఐఎ, ఈడీ దాడులు

రాజకీయ పార్టీ ముసుగులో దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరింప చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) గుట్టు దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాలలో జాతీయ దర్యాప్తు సంస్ (ఎన్ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం జరిపిన తాజా దాడుల్లో వెల్లడైంది. ఈ సందర్భంగా వందమందిని అరెస్ట్ చేశారు.
 
దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్ఐఏ,ఈడీ అధికారులు ఏకకాలంలో పలుచోట్ల ఆకస్మిక దాడులు చేశారు.  పీఎఫ్ఐ ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వడం, శిక్షణ శిబిరాలు నిర్వహణ, ప్రజలను ఉగ్రవాద సంస్థల్లో చేర్చిందని ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది.
 
200కు పైగా ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, పలువురు కార్యకర్తల ఇళ్లపై దాడులు చేసి సోదాలు జరపగా పలు విషయాలు వెలుగు చూశాయి.మళప్పురం జిల్లా మంజేరిలోని పీఎఫ్ఐ పార్టీ ఛైర్మన్ ఒమా సలాం ఇంటితో సహా పలువురు ఆ పార్టీ కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల సందర్భంగా పీఎఫ్ఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు.ఎన్ఐఏ, ఈడీ అధికారులు కేరళలోని 50 ప్రాంతాల్లో తమ పార్టీ నేతల ఇళ్లపై దాడులు చేశారని ఆ పార్టీ కేరళ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సత్తార్ చెప్పారు.
మధురై, తేనీ, దిండిగుల్, రామనాథపురం, కడలూరు, తిరునల్వేలీ, టెంకాసీ ప్రాంతాల్లోని పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తల ఆస్తులపై బుధవారం రాత్రి ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. కడలూరు పీఎఫ్ఐ అధినేత ప్యాజ్ అహ్మద్, మధురై జిల్లా కార్యదర్శి యాసర్ అరాఫత్ లను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని కర్నూలు,గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పీఎఫ్ఐ నేతలకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేసి, వారి అక్రమ కార్యకలాపాలపై దర్యాప్తు సాగిస్తోంది.

కాగా, తెలుగు రాష్ట్రాలతో పాటు మరోసారి ఎన్‌ఐఏ సోదాలుశుక్రవారం కూడా కొనసాగిస్తున్నది. ఈరోజు తెల్లవారుజాము నుంచి జరుగుతున్న ఆపరేషన్‌లో ఎన్ఐఏతో పాటు ఈడీ, స్థానిక పోలీసులు కూడా ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాల వెల్లడి వెల్లడించాయి.  ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, శిక్షణ శిబిరాలు నిర్వహించడం,  ఉగ్ర సంస్థల్లో చేర్చేందుకు సమాయత్తం చేయడం, మానసికంగా మార్చడం వంటి అనేక ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. సుమారు 40 ప్రదేశాల్లో జరుగుతున్న సోదాల్లో దర్యాప్తులో ఈడీ అధికారులు ఉన్నట్లు సమాచారం.