మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని, ఈ కేసుని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌లో సీబీఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై అక్టోబరు 14లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది.
వైఎస్ వివేకా హత్యకేసులో సాక్షులకు ముప్పు పొంచి ఉందని, ఈ కేసు దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ లేదా ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ వివేకానందరెడ్డి కుమార్తె డా. నర్రెడ్డి సునీతా రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ వివేకా హత్యకేసులో సాక్షులకే కాకుండా దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కూడా ముప్పు ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకే కేసు దర్యాప్తును ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.
ఈ కేసులో చార్జిషీటు, అదనపు చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ.. ఇంకా దర్యాప్తు చేస్తోందని చెప్పారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత దర్యాప్తు దేనికి..? అని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి లూథ్రా బదులిస్తూ హత్యకేసులో ఇతరుల పాత్రపైనా సీబీఐ దర్యాప్తు జరుపుతోందని తెలిపారు. సిట్ దర్యాప్తు ముందుకు సాగలేదని, ఆ తర్వాత హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించిందని తెలిపారు. రాష్ట్రంలో ఒత్తిళ్లు, బెదింపుల కారణంగా ట్రయల్ ముందుకు సాగదని పేర్కొన్నారు.
More Stories
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్
15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్