శ్రీశైలం, నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌లకు భారీగా వరద నీరు

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతోంది. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులతోపాటు గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల వరద నమోదవుతోంది.  శ్రీశైలం ప్రాజెక్టుకు 2, 38, 984 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా, నాగార్జునసాగర్‌ 163, 824 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో అధికారులు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.  ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన కర్ణాటకలో ఉన్న అలమట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్‌ల నుంచి లక్ష క్యూసెక్కుల చొప్పున, తుంగభద్ర జలాశయం నుంచి 2, 12, 200 క్యూసెక్కుల వరద వస్తోంది.
 
ఇక గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్‌కు 1, 12, 780 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో కొనసాగుతుండగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1,60,815 క్యూసెక్కుల వరద వస్తోంది. కడెం ప్రాజెక్టుకు 3900 క్యూసెక్కుల ఇన్‌ప్లో కొనసాగుతుండగా 4752 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. కాగా  పాల్వంచ, కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. కిన్నెరసాని ప్రాజెక్టు డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులకుగాను ప్రస్తుతం నీటి మట్టం 406.20అడుగులకు చేరింది. 5300 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది.
వరద అంతకంతకు పెరుగుతుండడంతో అధికారులు సోమవారం రాత్రి ప్రాజెక్టు గేట్లను ఎత్తి వరదను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవంక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 22 వరకు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.

ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.