
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం బీజేపీ పార్టీలో చేరారు. అలాగే ఆయన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బీజేపీలో విలీనం చేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిరణ్ రిజీజు బీజేపీ కండువా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా, మరో కేంద్రమంత్రి నరేంద్ర తోమర్ సభ్యత్వాన్ని అందజేశారు.
అంతకు ముందు అమరీందర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పంజాబ్ ఎన్నికలకు ముందు అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌ను వీడి.. కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే, అమరీందర్ భార్య ప్రణీత్ కౌర్ పాటియాల ఎంపీగా గెలుపొందగా, ఆమె కాంగ్రెస్‌లోనే కొనసాగనున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ కాంగ్రెస్‌ను వీడి ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. అప్పట్లో ఆయన తనయుడు రణిందర్ సింగ్ బీజేపీతో సమన్వయం చేసుకుంటూ టికెట్ల పంపిణీలో కీలక పాత్ర పోషించారు. అయితే, పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం ముందు కాంగ్రెస్, బీజేపీ సహా ఏ పార్టీ నిలవలేకపోయాయి.
ప్రస్తుతం పంజాబ్‌లో పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే బలమైన సిక్కు నేత కోసం వెతుకున్నది. మాజీ సీఎం అమరీందర్‌కు ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. అమరీందర్ కాంగ్రెస్ నుంచి రెండుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటు పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు. చేరిన కుటుంబ సభ్యులలో అమరీందర్ కుమార్తె జై ఇందర్ కౌర్, కుమారుడు రణిందర్ సింగ్, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు.
పంజాబ్ సరిహద్దు రాష్ట్రమైనందున శాంతి, సామరస్యం అవసరమని చెబుతూ “కెప్టెన్ ఆలోచనలు ఎల్లప్పుడూ బిజెపికి దగ్గరగా ఉంటాయి. బిజెపి వలె, ఆయన కూడా ‘నేషన్ ఫస్ట్’ అని నమ్ముతారు. సరిహద్దుల వెంబడి బిఎస్ఎఫ్ కార్యకలాపాలను విస్తరించడాన్ని ఇతరులు వ్యతిరేకించినప్పుడు కెప్టెన్ మద్దతు ఇచ్చారు” అని తోమర్ గుర్తు చేశారు.
“సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ ను మరింత సున్నితంగా నిర్వహించాలి. ఇది చారిత్రాత్మక అడుగు. ఇది రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుంది” అని రిజిజు పేర్కొన్నారు. జాతీయవాదంపై బీజేపీ వైఖరితో తాను ఏకీభవిస్తున్నట్లు అమరిందర్ సింగ్ తెలిపారు.
“నేను 52 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. మాది సరిహద్దు రాష్ట్రం. పాకిస్థాన్‌తో మన సంబంధాలు క్షీణించాయి. మనకు మూడు యుద్ధాలు జరిగాయి, శత్రుత్వం పెరిగింది, కొత్త అభివృద్ధి గురించి నేను ప్రధానమంత్రి, హోమ్ మంత్రిలకు తెలియజేసాను. డ్రగ్స్, ఆయుధాలు, డబ్బుతో డ్రోన్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది. మన రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించడం మన కర్తవ్యం” అని సింగ్ తెలిపారు.
దేశ భద్రతను పెంపొందించడంలో కాంగ్రెస్ తగినంత కృషి చేయలేదని, ఎ కె ఆంటోని రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు రక్షణ కొనుగోళ్లలో జాప్యం చేసిందని ఆయన విమర్శించారు. బీజేపీలో చేరాక కెప్టెన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమయ్యారు. 2024లో పంజాబ్‌లో బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లు గెలిచే బాధ్యతను కెప్టెన్‌కు అప్పగించనున్నారు.
More Stories
ఉగ్రదాడి సాకుతో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా అడగను
గాయని నేహా రాథోడ్‌పై దేశద్రోహం కేసు
పాతబస్తీలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు