సికింద్రాబాద్‌ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ ఎదురుగా కూతవేటు దూరంలో ఉన్న రూబీ వేర్ లాడ్జీలో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో  దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక 8 మంది చనిపోయారు. ఐదుగురు ఘటనా స్థలంలో దుర్మరణం చెందగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. 
 
మృతులు సీతారామన్(చెన్నై), వీతేంద్ర(ఢిల్లీ), హరీష్(విజయవాడ) మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్, అండర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన షోరూమ్ ఉంది. షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి తోడు దట్టమైన పొగలు అలుముకోవడంతో గదులలో ఉన్నవారు స్పృహ తప్పి కిందపడిపోయారు. 
 
స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పెద్ద పెద్ద శబ్దాలతో పేలుడుండడంతో త్వరగా మంటలు ఆర్పేందుకు కుదరలేదు. ఈ క్రమంలో పోలీసులు పెద్ద సాహసమే చేశారు. హోటల్ గదిలో చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు. 
 
అయితే.. అప్ప‌టికే చాలామందికి మంటలు అంటుకుని హాహాకారాలు చేస్తూ హోటల్ నుంచి కిందికి దూకేశారు. వారిలో కొంతమంది కాళ్లు రెక్కలువిరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ముగ్గురిని ఒక ఎస్సై ప్రాణాలతో కాపాడారు.
 
రూబీ ఎలక్ట్రిక్‌ షోరూం, హోటల్‌ మొత్తం ఐదంతస్తుల్లో కొనసాగుతున్నాయి. అయితే.. ఆ హోటల్‌ భవనం నుంచి లోనికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే దారి ఉంది. భవనానికి సెట్‌ బ్యాక్స్‌లేవు. దీంతో.. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బంది పడ్డారు. 
 
సరిపడా అగ్నిమాపక వాహనాలు వచ్చినా.. ఒకవైపు నుంచే మంటలను ఆర్పాల్సి వచ్చింది. హోటల్‌ గదుల్లో ఏసీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని ఫైర్‌ సిబ్బంది చెబుతున్నారు.
ప్రధాని మోదీ సంతాపం 

సికింద్రాబాద్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ  దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్న మోదీ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పిఎంఎన్ఆర్ఎఫ్  నుండి మృతుల ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తామని, గాయపడిన వారికి రూ.50,000  ఆర్థిక సహాయం అందజేస్తామని వెల్లడించారు.