అసెంబ్లీ నుండి ఈటెల సస్పెన్షన్…. పోలీస్ వాహనంలో తరలింపు 

తెలంగాణ అసెంబ్లీ  నుండి బిజెపి ఎమ్యెల్యే, మాజీ  స్పీకర్‌ పోచారం ఈటెల రాజేందర్ ను సస్పెండ్ చేయడం, బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడాలని ప్రయత్నిస్తే పోలీసులు అరెస్ట్ చేయడంతో అసెంబ్లీ వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది.  
 
గత వారం బిఎసి సమావేశంకు బిజెపి సభ్యులను ఆహ్వానించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్‌‌ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో సభ నుంచి బయటకు వచ్చి ఈటలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
 
వెంటనే ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్‌‌పై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీస్ వాహనంలో ఎక్కేందుకు ఈటల వ్యతిరేకించగా బలవంతంగా ఎక్కించి శామీర్‌పేటలోని ఆయన నివాసంలో విడిచిపెట్టారు.  తన సొంత వాహనంలో బయటకు వెళతానని బీజేపీ ఎమ్మెల్యే చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 
 
ఈరోజు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ పై ఈటల వ్యాఖ్యలను నిరసిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను ఈటల వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాల్సిందే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే  వినయ్ భాస్కర్ డిమాండ్  చేశారు.  
 
స్పీకర్‌పై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. చర్చ కన్నా రచ్చ చేసేందుకే వస్తున్నారని మండిపడ్డారు. ఈటల వెంటనే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈటల మాట్లాడుతూ ‘12ఏళ్లుగా సభలో ఉన్నాను… సభా మర్యాదలు నాకు తెలుసు. సభ నుంచి తనను బయటకు పంపాలని చూస్తున్నారా?మీ ఉద్దేశం ఏంటి’’ అంటూ ప్రశ్నించారు.
అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్‌ ను సస్పెండ్‌ చేస్తూ అసెంబ్లీ వ్యవహారాల చీఫ్ ప్రశాంత్‌ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, దాన్ని అసెంబ్లీ  ఆమోదించింది. దీంతో నేటితో ముగియనున్న మూడు రోజుల శీతాకాల అసెంబ్లీ సమావేశాల నుంచి ఈటల రాజేందర్‌ ను సస్పెండ్‌ అయ్యారు. సమావేశాలు ముగిసే వరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు  స్పీకర్ ప్రకటించారు. “నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? బెదిరిస్తున్నారా?” అంటూ ఈటెల  ప్రశ్నించగా,సభ నుంచి వీడాలని స్పీకర్ కోరారు.

అసెంబ్లీ వద్ద పోలీసులు ప్రవర్తించిన తీరుపై రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బానిసలా వ్యవహరించవద్దంటూ పోలీసులపై మండిపడ్డారు. ‘‘మీ నాశనానికే ఇదంతా చేస్తున్నారు. సంవత్సర కాలంగా కుట్ర చేస్తున్నారు. గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరు కాకుండా చేస్తున్నారు. గొంతు నొక్కుతున్నారు. గద్దె దించే వరకు విశ్రమించను. మీ తాటాకు చప్పుళ్లకు భయపడను’’ అంటూ ఈటల స్పష్టం చేశారు. 

ఈటెలను అసెంబ్లీ నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. హామీలు అమలు చేయలేని వాళ్ళను మరమనిషి అనడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. “ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే మాలో ఒక ఎమ్యెల్యేను ఇప్పటికే జైలుకు పంపారు. ఇప్పుడు మరో ఎమ్యెల్యేను సభ నుండి సస్పెండ్ చేశారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.