కిమ్ జోంగ్ ఉన్ మాదిరిగా వ్యవహరిస్తున్న మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని బెంగాల్ లో ప్రతిపక్ష నేత, బీజేపీకి నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ సచివాలయం నాబన్నకు కవాతు చేయడానికి వెళ్తున్న బీజేపీ నేతలు సువేందు అధికారి, లాకెట్ ఛటర్జీ తదితరులను పోలీసులు మార్గమధ్యంలో అరెస్టు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సువేందు అధికారిని అరెస్టు చేయడానికి ముందు ఆయనకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మహిళా పోలీసు కానిస్టేబుళ్లు తనను పట్టుకోవడానికి ప్రయత్నించడంపై సువేందు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న ఐపీఎస్ అధికారిని పిలవాలని డిమాండ్ చేశారు.

దీంతో దక్షిణ కోల్‌కతా డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆకాశ్ అక్కడికి వచ్చారు. ఆయనతో సువేందు మాట్లాడుతూ, మహిళా పోలీసులు తనను పట్టుకుంటున్నారని, ఇది తగదని చెప్పారు. తాను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. దీంతో ఆకాశ్ బదులిస్తూ, తమ దళంలో స్త్రీ, పురుష భేదం లేదన్నారు.

తనను ఎందుకు ఆపుతున్నారని పోలీసులను సువేందు అధికారి ప్రశ్నించారు. తనను కవాతుకు వెళ్ళనివ్వాలని కోరారు. ఆటవిక కార్యకలాపాలకు పరిమితులు ఉండాలని హితవు చెప్పారు. ఇది భారత దేశమని మేదినీపూర్‌లో ఉన్న లేడీ కిమ్ (మమత బెనర్జీ)కి చెప్పండని కోరారు. ఆమె బెంగాల్‌ను మరో ఉత్తర కొరియాగా మార్చేశారని మండిపడ్డారు.

సువేందు, లాకెట్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరువురినీ పోలీసులు వేర్వేరు వ్యాన్లలో కోల్‌కతాలోని లాల్ బజార్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు.