అమ్మ అడుగుజాడల్లోనే నడుస్తా…. చార్లెస్‌-3

నిస్వార్ధపు సేవకు నిలువెత్తు రూపం తన తల్లి ఎలిజబెత్‌-2 అని, ఆమె అడుగుజాడల్లోనే తానూ నడుస్తానని బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3  ప్రతిన చేశారు. బ్రిటన్‌ రాజుగా మొదటిసారిగా పార్లమెంట్‌లో సోమవారం ప్రసంగిస్తూ ఎంతో విలువైన, రాజ్యాంగబద్ధమైన పాలనా సూత్రాలను పరిరక్షిస్తానని హామీ ఇచ్చారు. 

మన ప్రజాస్వామ్యానికి సజీవమైన సాక్ష్యం, పార్లమెంట్‌ అని ఆయన అభివర్ణించారు. కొత్త రాజుకు తాము విధేయంగా వుంటామని పార్లమెంట్‌ సభ్యులందరూ ప్రతిన చేశారు. ఆ తర్వాత స్పీకర్‌ సర్‌ లిండ్సే హోయలే సంతాప సందేశాన్ని చదివి వినిపించారు. తర్వాత దానిని రాజుకు అందచేశారు. 

సంతాప సమావేశం అనంతరం రాజు చార్లెస్‌ దంపతులు ఎడిన్‌బరో నుండి రాణి ఎలిజబెత్‌ అంతిమయాత్రలో పాల్గనేందుకు వెళ్ళారు. స్కాటిష్‌ రాజధానిలో సెయింట్‌ గిల్స్‌ కేథడ్రల్‌లో ప్రజల సందర్శనార్ధం ఆమె భౌతిక కాయాన్ని 24 గంటలు వుంచుతారు. ఆ తర్వాత ఇంగ్లండ్‌కు విమానంలో తీసుకువస్తారు. 14వ తేదీన వెస్ట్‌ మినిస్టర్‌ ప్యాలెస్‌కు తీసుకువెళతారు.

గత గురువారం కన్నుమూసిన రాణి ఎలిజబెత్‌-2 స్మృత్యర్ధం ఈ నెల 18న బ్రిటన్‌ వ్యాప్తంగా రాత్రి 8 గంటలకు ఒక నిముషం పాటు మౌనాన్ని పాటించనున్నట్లు ప్రధాని లిజ్‌ ట్రస్‌ ప్రతినిధి తెలిపారు.

కాగా, వచ్చే సోమవారం జరగనున్న బ్రిటన్‌ రాణి అంత్యక్రియల కార్యక్రమంలో దాదాపు 500 మంది విదేశీ ప్రతినిధులు పాల్గంటారని భావిస్తున్నారు. వీరందరూ హెలికాప్టర్లలో లేదా తమ స్వంత వాహనాల్లో కాకుండా బస్సుల్లోనే అంత్యక్రియలు జరిగే స్థలానికి చేరుకున్నారు. 

కార్యక్రమం అంతా సాఫీగా, సజావుగా సాగేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని సంబంధిత విభాగ అధికారి తెలిపారు. 1965లో విన్‌స్టన్‌ చర్చిల్‌ తర్వాత ఆరు దశాబ్దాల్లో మొట్టమొదటి ప్రభుత్వ అంత్యక్రియల కార్యక్రమమైనందున పెద్ద ఎత్తున బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.