ప్రపంచ గతిని మార్చిన వివేకానంద చికాగో ప్ర‌సంగం

 
స్వామి వివేకానంద అమెరికా చికాగో విశ్వమత ప్రతినిధుల సభలో 1893 సెప్టెంబ‌ర్ 11న చేసిన ప్ర‌సంగం ప్ర‌పంచ‌ గ‌తిని మార్చివేసిందని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్య‌క్షులు స్వామి బోధ‌మ‌యానంద చెప్పారు. స్వామి వివేకానంద చికాగో విశ్వమత ప్రతినిధుల సభలో ప్రసంగించి 129 సంవత్సరాలైన సందర్భంగా హైద‌రాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వ‌ద్ద రామకృష్ణ మఠం ఆధ్వ‌ర్యంలో ఆదివారం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.
స్వామి వివేకానంద విగ్ర‌హానికి పూలమాలలు వేశాక స్వామి వివేకానంద చికాగోలో చేసిన తొలి ప్ర‌సంగాన్ని ఈ సందర్భంగా స్వామి బోధ‌మ‌యానంద చ‌దివి వినిపించారు.  వివేకానంద ప్ర‌సంగించింది కొద్ది నిమిషాలే అయినా అమెరికా స‌హా ప్ర‌పంచ దేశాలు భార‌త్ గొప్ప‌త‌నాన్ని గుర్తించాయ‌ని ఆయన పేర్కొన్నారు.
 భార‌త్ ముంగిట ప్ర‌పంచ‌దేశాలు సాగిల‌ప‌డ్డాయ‌ని చెబుతూ నేటికీ స్వామి వివేకానంద బోధ‌న‌లు అనుస‌ర‌ణీయ‌మని తెలిపారు. ఆధ్యాత్మిక‌, సాంస్కృతిక భార‌త్ గొప్ప‌త‌నాన్ని భ‌విష్య‌త్ త‌రాల‌కూ అందేలా చూడాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌ని బోధ‌మ‌యానంద ఈ సందర్భంగా పిలుపిచ్చారు.
ఈ నెల 13న వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తామ‌ని, ఈ కార్యక్రమానికి గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ తదితరులు హాజరౌతున్నారని స్వామి బోధ‌మ‌యానంద చెప్పారు.
 
ముఖ్య అతిథిగా విచ్చేసిన సీబీఐ మాజీ జేడీ వి.వి. ల‌క్ష్మీ నారాయ‌ణ మాట్లాడుతూ చికాగో ప్ర‌సంగంలో స్వామి వివేకానంద సిస్ట‌ర్స్ అండ్ బ్ర‌ద‌ర్స్ అని సంబోధించ‌డం అమెరిక‌న్ల‌ను త‌న్మ‌యత్వానికి గురిచేసింద‌ని చెప్పారు.  వివేకానంద ఆద‌ర్శాల‌ను అనుస‌రించ‌డ‌మే ఆయ‌న‌కు స‌రైన నివాళి అని తెలిపారు. బాల‌బాలిక‌లు, ముఖ్యంగా యువ‌త వివేకానంద బోధ‌న‌ల‌ను అర్థం చేసుకుని ఆచ‌ర‌ణ‌లో పెట్టాల‌ని ఆయన సూచించారు. 
 
ట్యాంక్‌బండ్‌పై కార్య‌క్ర‌మం నిర్వ‌హించాక భక్తులు ర్యాలీగా రామకృష్ణ మఠానికి చేరుకున్నారు. ఆ త‌ర్వాత రామకృష్ణ మఠంలోని వివేకానంద ఆడిటోరియంలో స్వామి వివేకానంద మహిమ పేరిట సంగీత విభావరి నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా స్వామి బోధ‌మ‌యానంద మాట్లాడుతూ స్వామి వివేకానంద‌కు సంగీతంపై ప‌ట్టు ఉండేద‌ని, స్వ‌యంగా పాట‌లు రాసి పాడేవార‌నిగుర్తు చేశారు. త‌న గురువైన రామకృష్ణ వివేకానందుడి గాత్రాన్ని ఇష్ట‌ప‌డేవార‌ని తెలిపారు.  బెంగళూరుకు చెందిన వోకలిస్ట్ సురమణి డాక్టర్ దత్తాత్రేయ వెలాంకర్, తబ్లా వాయిద్యకారుడు యోగేశ్ భట్ ఈ విభావరిలో పాల్గొన్నారు.