రాహుల్ యాత్ర మూడు రోజుల్లో మూడు వివాదాలు!

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలు పెట్టి మూడు రోజులు కాకముందే మూడు వివాదాలు వెలుగుచూశాయి. మొదటవంతంగా విలాసవంతమైన కంటైనర్లతో పాదయాత్ర చేయడమేంటని అధికార భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏసీ సౌకర్యం ఉన్న లగ్జరీ కంటైనర్లు అవసరమా అని ప్రశ్నిస్తోంది.   
భారత్‌ జోడో యాత్రలో  రాహుల్‌ గాంధీ బర్బెరీ బ్రాండ్‌కు చెందిన టీ-షర్టు ధరించారని, దీని ధర రూ.41 వేలు అని బీజేపీ చెబుతోంది. రాహుల్‌ ఎంత ఖరీదైన టీ-షర్టును ధరించారో చూడండంటూ ‘భారత్‌ దేఖో’ అనే క్యాప్షన్నూ పెట్టింది. రాహుల్‌ ఫొటో పక్కన రూ.41,257 ఖరీదైన బర్బెరీ బ్రాండ్‌ టీషర్టును పోస్టు చేసింది. విలాసవంతమైన వస్త్రధారణతో నిరుపేదల సమస్యలు తెలుసుకుంటారా? అని బీజేపీ సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేసింది.
తాజాగా, ”భారత్ జోడో యాత్ర”లో భాగంగా రాహుల్ గాంధీ తమిళనాడుకు చెందిన ఒక వివాదాస్పద కేథలిక్ పాస్టర్‌ను  శుక్రవారంనాడు కలుసుకున్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణలతో కూడిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీజేపీ నేతలు దీనిపై విమర్శలు గుప్పించారు.
కన్యాకుమారి జిల్లాలో కేథలిక్ ప్రీస్ట్ జార్జి పొన్నయ్య ()ను రాహుల్ గాంధీ  కలుసుకున్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో భాగంగా రాహుల్ గాంధీ ఆయనను ”ఏసుక్రీస్తు భగవంతుని రూపమా? అది నిజమేనా?” అని ప్రశ్నించారు. వెంటనే జార్జి పొన్నయ్య తడుముకోకుండా ”ఆయన ఒక్కడే నిజమైన దేవుడు” అని సమాధానమిచ్చారు.
తన వాదన కొనసాగుస్తూ, భగవంతుడు మనిషి రూపంలోనే వెల్లడవుతాడు, మీ శక్తి లాంటి వాడు కాదంటూ పోలిక తెచ్చారు. దీంతో వివాదాస్పద పాస్టర్‌ను రాహుల్ కలుసుకోవడం, ఫాస్టర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు.
వివాదాస్పద పాస్టర్‌ను రాహుల్ కలుసుకోవడం, పాస్టర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ విమర్శలు గుప్పించారు. శక్తి (హిందూ దేవతలు) తరహాలో కాకుండా జీసస్ మాత్రమే భగవంతుడు అని పాస్టర్ చెప్పడాన్ని నిలదీశారు. ప్ర‌ధాని మోదీ, అమిత్ షాలతో పాటు డీఎంకే నేత‌ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన కేసులో గ‌తంలో ఓ సారి పొన్న‌య్య‌ను అరెస్టు చేశారు. 
హిందువులను సవాలు చేసి, బెదరించిన జార్జి పొన్నయ్య ఈరోజు భారత్ జోడో యాత్ర పోస్టర్ బాయ్‌ను కలిశారని, భారత్‌మాత గురించి ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. హిందూ వ్యతిరేక భావాలున్న సుదీర్ఘ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని షెహజాద్ పూనావాలా ఓ ట్వీట్‌లో విమర్శించారు. ”భారత్ జోడో విత్ భారత్ టోడో ఐకాన్స్” అంటూ ఎద్దేవా చేశారు.