ఖనిజ రంగాన్ని ‘ఆత్మ నిర్భర్’గా మార్చే దిశలో మరో అడుగు

కేంద్ర గనులు, బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి హైదరాబాద్ లో శుక్రవారం ప్రారంభించిన  గనుల శాఖ మంత్రుల రెండు రోజులజాతీయ సదస్సు ఖనిజ రంగాన్ని ‘ఆత్మ నిర్భర్’గా మార్చడంతో పాటు భారతదేశంలో సుస్థిరమైన గనుల రంగ అభివృద్ధి ని ప్రోత్సహించే దిశలో మరో అడుగు అని పేర్కొన్నారు. 

గనుల మంత్రుల జాతీయ సమావేశం ఖనిజ రంగాన్ని ‘ఆత్మ నిర్భర్’గా మార్చడం కోసం స్థిరమైన గనుల రంగ అభివద్ధి ని ప్రోత్సహించే దిశలో మరో అడుగు అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం పరస్పర సహకారంతో పనిచేసినప్పుడే ఈ అమృత్ కాల్‌ లో స్వావలంబన  స్వయంసమృద్ది లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. 

 11 రాష్ట్రాలకు చెందిన గనుల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు/ప్రత్యేక కార్యదర్శులు (గనులు), 19 రాష్ట్రాలు,1 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డిజిఎం లతో పాటు గనులు, బొగ్గు, ఉక్కు మంత్రిత్వ శాఖల  అధికారులు, ఈ మంత్రిత్వ శాఖలోని 14 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి సిఎండీలు, 10 నోటిఫైడ్ ప్రైవేట్ అన్వేషణ సంస్థల అధిపతులు పాల్గొన్నారు. 

 గనుల శాఖ మంత్రి ఈ సందర్భంగా  ‘ది మైనింగ్ ఎరీనా’ అనే డిజిటల్ వేదికను ప్రారంభించారు.  ఇది గనుల మంత్రిత్వ శాఖ  పథకాలను, కార్యక్రమాలను గురించి ప్రజలకు ప్రత్యక్ష అనుభవాన్ని, సమాచారాన్ని అందించే ఒక ఇంటరాక్టివ్ వేదిక. ఇది  గనుల రంగ అభివృద్ధి కోసం మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పాత్ర బాధ్యతలు, విజయాలపై  మరియు మంత్రిత్వ శాఖ యొక్క అనుబంధ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల, స్వయంప్రతిపత్త సంస్థల సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది.

ఈ రంగంలో సులభతమైన వ్యాపారంను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఖనిజ లోహాల బ్లాకుల అన్వేషణ వల్ల  పెట్టుబడిదారులకు బ్లాక్‌ల వేలం సులభతరం చేయడం వల్ల ఈ రంగం లో పోటీతత్వాన్ని మరింత పెంచడం ద్వారా 7 సంవత్సరాలలో ఖనిజాల ఉత్పత్తి 200 శాతం  పెరగటానికి అవకాశం   కల్పించింది. 

మనం అమృత్ కాల్‌లోకి ప్రవేశిస్తున్న ఈ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త విధాన సంస్కరణల  వ్యూహాలను అభివృద్ధి చేయడం, సాధించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం గనుల మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించింది. 2047  నాటికి మైనింగ్ రంగానికి సంబంధించిన అమృత్ కాల్‌ లక్ష్యాలను సాధించాలని నిర్ణయించారు.

గనుల రంగంలో  ప్రయత్నాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ) నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై చర్చలు జరిగాయి.  ఆగష్టు, 2015లో ఏర్పాటు చేసిన ఎన్ఎంఈటీ ఇప్పటివరకు ఆమోదించిన 238ప్రాజెక్టులలో రూ.  513.85 కోట్ల వ్యయంతో 132 ప్రాజెక్టులు పూర్తి చేశారు. 

 గనుల మంత్రిత్వ శాఖ 10 ప్రైవేట్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీలను నోటిఫై చేసింది. ఈ నోటిఫైడ్ ప్రైవేట్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీలు నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ నుండి నిధులు పొందేందుకు అర్హులు.  ఖనిజ ఉత్పత్తిని పెంచడం, రాష్ట్ర ప్రభుత్వాల  ఆదాయాలను పెంచడం, ఉపాధి కల్పన, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడం మొదలైన లక్ష్యంతో ఎంఎండిఆర్ చట్టం 2016, 2020, 2021లలో సవరించారు.

10 రాష్ట్రాల్లో ఇప్పటివరకు 206 మినరల్ బ్లాక్‌లు వేలం వేశారు. ఈ సవరణలతో సంవత్సరానికి వేలం వేయబడే బ్లాకుల సంఖ్య 3 రెట్లు పెరిగింది.  దీని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు కూడా గణనీయంగా పెరిగాయి.  రాష్ట్ర ప్రభుత్వాల  ప్రస్తుత వేలం పరిస్థితిని కూడా ఎజెండా లో చేర్చారు. కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ వంటి ఏడు రాష్ట్రాలు తమ రాష్ట్రాలలో ఖనిజ లభ్యత సంభావ్యత, ఈ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు