అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుపై స్థానికంగా ఆగ్రహం

అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 12వ తేది నుండి పాదయాత్రకు రాజధాని ప్రాంత రైతులు సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టాలన్న ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలు చెలరేగుతున్నాయి. 

గ్రామసభల్లో అభ్యంతరాలు రాకపోతే మున్సిపాల్టీ ఏర్పాటును ఆమోదించినట్లు భావిస్తామని ప్రభుత్వం చెబుతుండగా, గ్రామసభకు ప్రజలు హాజరు కాకపోతే వాయిదా వేయాలని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. అందరూ పాదయాత్రకు వెళ్లిన సమయంలో గ్రామసభలు నిర్వహించి ఆమోదించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ తరహా చర్యలకు దిగిందని రైతులు మండిపడుతున్నారు. 

గతంలో 22 గ్రామాలతో కార్పొరేషన్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇవ్వగా వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఏ నోటిఫికేషన్‌ ఇచ్చినా కనీసం 30 రోజుల సమయం ఉంటుందని, ఇప్పుడు పదిరోజుల్లో తేల్చేయాలని చెప్పడం సబబు కాదంటున్నారు. అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాను ప్రకారం 217 చదరపు కిలోమీటర్లలో 29 గ్రామాలతో ఏర్పాటు చేశారు.

దీనికి సుర్బానా కంపెనీ మాస్టర్‌ప్లాను ఇచ్చింది. దీని ప్రకారం రోడ్ల పనులూ చేపట్టారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని గ్రామాలను మాస్టర్‌ ప్లానులో నుండి తొలగించి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్లో కలిపింది. మాస్టర్‌ప్లాను ముక్కలు చేయడంపై రైతులు కోర్టుకు వెళ్లారు. పిటీషన్లు పరిశీలించిన న్యాయస్థానం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలోని రాజధానిని యథాతథంగా ఆరునెలల్లో అభివృద్ధి చేయాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో కొత్తగా ఇచ్చిన మున్సిపాలిటీ నోటీసు చెల్లదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. అమరావతి టు అరసవిల్లి పాదయాత్ర 12వ తేదీన వెంకటపాలెం శ్రీవెంకటేశ్వర దేవస్థానం నుండి ప్రారంభించనున్నారు. అయితే 8వ తేదీన ఇచ్చిన నోటీసులకు 10 రోజుల్లో సభలు నిర్వహించి సమాచారం పంపాలని ఆదేశించిన నేపథ్యంలో పాదయాత్రపై సందిగ్ధత నెలకొంది. 

గ్రామ సభలకు హాజరై ముక్తకంఠంతో ప్రతిపాదనను వ్యతిరేకించాలని రైతులు భావిస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రలో వెళ్లేవారి వివరాలు కోర్టు కోరడంతో ఒకవేళ వారందరూ పాదయాత్రకు వెళితే గ్రామాల్లో ప్రభుత్వ అనుకూలురు హాజరై నిర్ణయం తీసుకుంటారు. 12వ తేదీన పాదయాత్ర ప్రారంభించకపోతే హైకోర్టు ఇచ్చిన అనుమతి రద్దవుతుంది. ఈ నేపథ్యంలో పాదయాత్రను కొనసాగిస్తూనే గ్రామాల్లో ప్రజలను సభలకు హాజరవ్వాలని భావిస్తున్నారు.