ఎమ్మెల్సీ క‌విత పీఏ ఇంట్లో ఈడీ సోదాలు..!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 35 చోట్ల ఈడీ సోదాలకు దిగింది. హైదరాబాద్ లో ఆరు చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాబిన్ డిసిలర్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న రామచంద్రన్ పిళ్లై, కంపెనీ తో పాటు ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
 
 పిళ్లై సహా మరో ఐదుగురి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. బోయినపల్లి అభిషేక్ రావు, సూదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలకు వెళ్లారు ఈడీ అధికారులు. ఎమ్మెల్సీ క‌విత పీఏగా ప‌నిచేస్తున్న అభిషేక్ రావు ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వ‌హించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ మంగళవారం ఢిల్లీ సహా గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్, ముంబై, బెంగళూరుల్లో 35 చోట్ల సోదాలు జరుపుతోంది. ఈ కేసులో నిందితుడు సమీర్ మహేంద్రుకు చెందిన ఢిల్లీ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి.
హర్యానాలోని గురుగ్రామ్‌లోని బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా, ఢిల్లీలోని జోర్ బాగ్‌లోని వ్యాపారవేత్త సమీర్ మహంద్రు, హైదరాబాద్   కోకాపేటలోని ఓ వ్యాపార వేత్త ఇళ్లల్లో  ఈడీ సోదాలు జరుగుతున్నాయి.  ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న అధికారులు, లిక్కర్ సిండికేట్ వ్యాపారుల ఇండ్లు, ఆఫీసుల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరిన్ని ఆధారాల వేట కోసం ఈడీ రంగంలోకి దిగినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరి ఇండ్లల్లో సోదాలు కూడా జరిగాయి.
అయితే, ఈ కేసులో నిందితుడుతైన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసం, కార్యాలయాలకు ఈడీ అధికారులు రాలేదని ఆమ్ ఆద్మీ పార్టీ  వర్గాలు మీడియాకు తెలిపాయి.  ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ 2021-22 రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగినట్లు సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలున్నట్లు ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ)కు సిఫార్సు చేశారు.
దాంతో సిబిఐ కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగింది. ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా మొత్తం 15 మంది వ్యక్తులు, ఓ కంపెనీ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. సీబీఐ గత నెలలో మనీశ్ సిసోడియా నివాసంలో తనిఖీలు చేసింది. ఢిల్లీ ఎక్సయిజ్ శాఖ మాజీ కమిషనర్ అరవ గోపీ కృష్ణ కూడా ఈ కేసులో నిందితుడే. గత నెలలో ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుమారు 19 చోట్ల సీబీఐ సోదాలు చేసింది.