
బెంగళూరులో ఉన్న ఈద్గా మైదానంలో రెండు రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. కర్ణాటక వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌పై యధాస్థితి కొనసాగించాలని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇవ్వడంతో, ఆ మైదానంలో ఎలాంటి మతపరమైన ఉత్సవాలు జరపకూడదని చెప్పినట్లయింది.
జాగా స్టేటస్ కో విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయటం వల్ల.. ప్రస్తుతం మరో కొత్త సమస్య తలెత్తింది. ఇప్పుడు ఆ స్థలం ప్రభుత్వానిదా లేక వక్ఫ్‌బోర్డుదా? అనే విషయం హైకోర్టు పరిధిలోకి వెళ్లింది. అంతకు ముందు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియా ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో, త్రిసభ్య ధర్మాసనానికి ఈ పిటిషన్‌ను నివేదించారు. నూతన ధర్మాసనంలో జస్టిస్ ఇందిరా మల్హోత్ర, జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ ఉన్నారు.
కాగా, ఆగస్టు 25న కర్నాటక హైకోర్టుకు చెందిన సింగిల్ బెంచ్ తీర్పు వెలువరిస్తూ బెంగళూరు ఈద్గా మైదానాన్ని ప్రభుత్వం లేదా బిబిఎంపి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి, ముస్లిం సమాజం రెండు ఈద్‌ల నాడు ప్రార్థనలు జరుపుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని ఆదేశించింది.
అయితే దీనిపై డివిజన్ బెంచ్‌కు పిటిషనర్లు వెళ్లగా ఆ మైదానంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలంటూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవరించింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ మైదానంలో ఇతర మతాల కార్యక్రమాలను నిర్వహించడం లేదని వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే తెలిపారు. చట్ట ప్రకారం ఇది వక్ఫ్ ఆస్తి అని తెలిపారు. 2022లో ఇది వివాదాస్పద స్థలమని ప్రకటించారని, ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించాలనుకుంటున్నారని పేర్కొన్నారు.
ధర్మాసనం స్పందిస్తూ, గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఈ మైదానంలో జరిగాయా? అని ప్రశ్నించింది. బృహత్ బెంగళూరు మహా నగర పాలికే (బీబీఎంపీ) తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి మాట్లాడుతూ, ఇప్పటి కార్యక్రమాన్ని వ్యతిరేకించడానికి అది ప్రాతిపదిక కాబోదని స్పష్టం చేశారు. 200 ఏళ్ళ నుంచి ఈ మైదానాన్ని బాలల ఆటస్థలంగా ఉపయోగిస్తున్నారని చెబుతూ రెవిన్యూ రికార్డుల్లో ప్రభుత్వం పేరు ఉందని తెలిపారు.
More Stories
ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మద్యం సేవించే మహిళలు
మహాకుంభ్‌లో 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు
కేరళ దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి