ఉగ్రవాద హబ్ గా మదరసా… బుల్డోజరుతో కూల్చివేత 

 
ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో పాటు బాంగ్లాదేశ్ కు చెందిన  ఉగ్రవాద సంస్థ ఎబిటి లతో   సంబంధాలున్నాయని ఓ మదరసాను బుల్డోజరుతో కూల్చివేసిన ఘటన అసోం రాష్ట్రంలోని బార్‌పేట జిల్లాలో తాజాగా వెలుగుచూసింది.
 
అల్ ఖైదాకు చెందిన బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లాటీమ్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అక్బర్ అలీ, అబుల్ కలాం ఆజాద్ అనే ఇద్దరు సోదరులను అరెస్టు చేసిన తర్వాత ధకలియాపరా వద్ద ఉన్న మదరసాను అసోం అధికారులు బుల్డోజరుతో కూల్చివేశారు. ఈ రెండు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు గల 37 మందిని  వరకు అస్సాంలో పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
మదరసా దేశ వ్యతిరేక కార్యకలాపాలు, జిహాదీ సంస్థల కార్యకలాపాల్లో పాలుపంచుకోవడంతోపాటు ప్రభుత్వ భూమిలో ఉన్నందున దాన్ని కూల్చామని ప్రభుత్వ అదనపు కమిషనర్ లచిత్ కుమార్ దాస్ చెప్పారు. 
 
మదరసా టెర్రరిస్టు హబ్‌గా నడుస్తున్నందున తాము దాన్ని బుల్డోజరుతో కూల్చివేశామని అసోం  ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు.అంతకు ముందు ఆగస్టు 4వ తేదీన కూడా అసోంలోని మోరిగావ్ జిల్లాలో ఒక మదరసాను కూల్చివేశారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద రెండు మదర్సాలను కూల్చివేశామని  హిమంత శర్మ చెప్పారు. ఈ ఏడాది అసోంలో ఐదు ఉగ్రవాద కుట్రలను ఛేదించి, పలువురిని అరెస్టు చేశామని అసోం అధికారులు చెప్పారు.