కేజ్రీవాల్ మద్యం విధానంపై మండిపడ్డ అన్నాహజారే!

సామాజిక కార్యకర్త అన్నా హజారే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ప్రభుత్వ మద్యం విధానంపై చెలరేగిన వివాదంపై మండిపడ్డారు. ఈ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు లేఖ వ్రాసారు.  మద్యం షాపులు, మద్యం వినియోగం, సిగరెట్ల విక్రయాలపై గతంలో కేజ్రీవాల్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆ లేఖలో గుర్తు చేస్తూ కఠినమైన పదజాలం ఉపయోగించారు. కేజ్రీవాల్ మాటలకు, ఆయన చర్యలకు తేడా ఉందని హజారే ఆరోపించారు.

రాజకీయాల్లోకి రాకముందు కేజ్రీవాల్ రాసిన ‘స్వరాజ్’ పుస్తకం గురించి హజారే ప్రస్తావించారు. హజారే తనతోనే పుస్తకానికి ముందుమాట వ్రాయించారని గుర్తు చేస్తూ అందులో గ్రామ సభ గురించి, ఆదర్శవంతమైన మద్యంవిధానం గురించి గొప్పలు రాశారని ఎద్దేవా చేశారు. 
 
కేజ్రీవాల్ తాను బోధించినవన్నీ మరచిపోయారని, ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీని రూపొందించిందని, దీని ద్వారా మద్యం అమ్మకాలు, మద్యం వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారని హజారే ఆరోపించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నుండి ఆవిర్భవించిన ఆప్ ఇతర పార్టీల మార్గంలోనే వెడుతున్నది అంటూ ఆయన స్పష్టం చేశారు.

‘స్వరాజ్’ పేరుతో ఉన్న ఈ పుస్తకంలో మీరు ఎన్నో ఆదర్శవంతమైన విషయాలు రాశారు.. అప్పుడు మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. కానీ రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఆదర్శ భావజాలాన్ని మరిచిపోయారనిపిస్తోంది’ అని హజారే తన లేఖలో విచారం వ్యక్తం చేశారు.  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిసి కేజ్రీవాల్ రాలెగంసిద్ధి గ్రామాన్ని సందర్శించిన సమయం గురించి ఆయన తన లేఖలో ప్రస్తావించారు. 

 
“లోక్‌పాల్ ఉద్యమం కారణంగా మీరు మాతో చేరారు. అప్పటి నుండి మీరు మనీష్ సిసోడియాతో కలిసి రాలెగంసిద్ధి గ్రామానికి చాలాసార్లు వచ్చారు. గ్రామస్థులు చేస్తున్న పనిని మీరు చూశారు. గ్రామంలో 35 సంవత్సరాలుగా మద్యం, బీడీ, సిగరెట్‌లు గత కొంతకాలంగా అమ్మకానికి లేవు. మీరు దీన్ని చూసి స్ఫూర్తి పొందారు. మీరు దీన్ని కూడా ప్రశంసించారు” అని అన్నాహజారే తెలిపారు.

“ఆప్ రాజకీయ మార్గాన్ని అవలంబించడం గురించి మాట్లాడింది. కానీ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం మన ఉద్యమం లక్ష్యం కాదని మీరు మర్చిపోయారు” అని అన్నా హజారే తీవ్రంగా విమర్శించారు. మద్యం అమ్మకాలను అరికట్టడంలో లేదా పరిమితం చేయడంలో విజయం సాధించిన మహారాష్ట్రలోని పలు గ్రామాలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు. 

 
దేశ రాజధానిలో కూడా కేజ్రీవాల్ ఇదే విధానాన్ని అమలు చేస్తారని తాను ఊహించానని, అయితే అది జరగలేదని అన్నాహజారే అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇటువంటి విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం కూడా ఏర్పర్చుతుందని ఆశించాను. కానీ మీరు అలా చేయలేదు. డబ్బుకు అధికారం అనే ఈ విష చక్రంలో ప్రజలు తరచుగా చిక్కుకుంటారు” అని ఆయన మండిపడ్డారు.

ఎక్సైజ్ పాలసీ అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిసోడియా నివాసంపై సీబీఐ గతంలో దాడులు చేసింది. ఆప్ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సిసోడియాను నిందితుడిగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అన్నాహజారే లేఖ ప్రాముఖ్యత సంతరింప చేసుకొంది.