భారీ కమీషన్లు ఇచ్చిన కంపెనీలకే ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ లైసెన్సులు

దేశ రాజధానిలో మద్యం వ్యాపారాన్ని సంస్కరించేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను ఢిల్లీ ప్రభుత్వం విస్మరించిందని, ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ కమీషన్లు చెల్లించిన కంపెనీలకే లైసెన్సులు ఇచ్చిందని బిజెపి ఆరోపించింది.
బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పంజాబ్ ఎన్నికలలో అక్రమంగా ప్రయోజనాలు పొందేందుకే తన సొంత కమిటీ చేసిన సిఫార్సులనే ఆప్ ప్రభుత్వం పాటించలేదని ఆరోపించారు. మద్యం పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారని, దర్యాప్తు నుంచి తప్పించుకునే దురాలోచనతోనే ఆయన ఒక్క ఫైలు పైన కూడా సంతకం చేయలేదని ఆయన ఆరోపించారు.
ఢిల్లీలో తమ ఎమ్మెల్యేలు నలుగురికి బిజెపి ముడుపులు ఇచ్చేందుకు ప్రయత్నించిందన్న ఆప్ ఆరోపణను గురించి ప్రశ్నించగా లిక్కర్ మాఫియా నుంచి వారికి అటువంటి ప్రతిపాదనలు వచ్చి ఉంటాయని సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు. తమకు ముడుపులు ఇవ్వజూపిన ఆ వ్యక్తుల పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ఆప్ నాయకులను ప్రశ్నించారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా మంత్రిగా చెప్పుకుంటున్న మనీష్ సిసోడియా వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎక్సైజ్ మంత్రిగా అప్పట్లో మీ పాత్ర ఏమిటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైల్, హోల్‌సేల్ లిక్కర్ వ్యాపారంపై కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఎందుకు విస్మరించారో చెప్పాలని, ఎవరి ఆదేశాల ప్రకారం మీరు నడుచుకున్నారని సిసోడియాను ఆయన ప్రశ్నించారు.