తాలిబన్ ఇలాకాలో తిరోగమనంలో ఆఫ్ఘన్ మహిళలు

ప్రపంచంలోకెల్లా ఆఫ్ఘనిస్తాన్‌లోని మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని, అది తిరోగమనానికి సూచిక అని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు వెనుకంజలో ఉన్నారని, అమ్మాయిలు చదువుకోవడానికి పాఠశాలలు తిరిగి తెరవాలని, ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల అత్యవసర సమన్వయకర్త మార్టిన్‌ గ్రిఫిత్స్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 
 
అలాగే పర్వానా అనే విద్యార్థి మాట్లాడుతూ ‘పాఠశాలలను తిరిగి తెరవమని అడుగుతున్నాను. ఇది మా హక్కు. చదువుకోవడం మా హక్కు.. మా హక్కుల్ని మేం పొందాలి… పాఠశాలలను తిరిగి తెరవాలి’ అని పేర్కొన్నారు. ఇక ఆఫ్ఘన్‌లోని మహిళలు, బాలికలు తమ హక్కుల్ని కోల్పోతున్నారని, నిర్బంధాల వల్ల వారు ప్రజాజీవితంలో పాల్గొనే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ యామినీ మిశ్రా తెలిపారు.

తాలిబన్ల పాలనలో మహిళల హక్కుల్ని కాలరాస్తున్నా అంతర్జాతీయ సంస్థలు కూడా పట్టించుకోవడం లేదని మహిళా హక్కుల కార్యకర్త ఐ నూర్‌ ఉజ్బెక్‌ విచారం వ్యక్తం చేశారు. ‘సంవత్సరం నుంచి పాఠశాలల తలుపులు మూసే ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేయడానికి ప్రయత్నాలు చేయడం లేదు’ అని ఆమె పేర్కొన్నారు. 
 
ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచే మహిళలపై ఆంక్షలు విధించడం మొదలైంది. మహిళల ఉద్యమం, విద్య, భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు. వారి మనుగడకు ముప్పుగా పరిణమించాయి. ఇది మాత్రమే కాదు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు లేకపోవడం వల్ల మహిళలు ప్రాథమిక వైద్య సదుపాయలు సైతం పొందలేక పోతున్నారు. 
 
తాలిబన్ల పాలనలో బాలికలు ఆరో తరగతి వరకే చదువుకునేందుకు అనుమతి ఉంది. ఆరో తరగతి పైన చదువుకునేందుకు తాలిబన్లు నిషేధం విధించారు. ఇప్పటికే మీడియాలో పనిచేస్తున్న 80 శాతం మంది మహిళలు ఉద్యోగాల్ని కోల్పోయారు. దాదాపు 18 లక్షల మంది మహిళలు ఆరోగ్యం, విద్య, సామాజిక హక్కుల కోసం పోరాడుతున్నారు.