దీక్ష భగ్నం.. జనగామలో బండి సంజయ్‌ అరెస్ట్

కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్‌ చేశారు. జనగామ పాంమ్నూరు వద్ద బండి సంజయ్‌ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు కార్యకర్తల తోపులాట మధ్యే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ తోపులాటలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. 
సోమవారం కవిత ఇంటివద్ద ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై తెలంగాణ ప్రభుత్వం పోలీసుల దాడి నేపథ్యంతో ఆయన దీక్షకు ఉపక్రమించగా  దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేశారు. ఇక పోలీసుల వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, బండి సంజయ్‌ పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ దాడి చేసే అవకాశం ఉందని కేంద్రానికి నిఘా వర్గాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత తరుణ్ చుగ్ సహా కేంద్ర పెద్దల బండి సంజయ్‌ను ఫోన్‌లో పరామర్శించారు.  ఇక దాడి నేపథ్యంలో భద్రత పెంచేందుకు పోలీసులు సిద్ధం కాగా, ఆ భద్రతను తిరస్కరించారు బండి సంజయ్. ‘నా భద్రత సంగతి కార్యకర్తలే చూసుకుంటారు’ అని ఆయన పోలీసులతో తేల్చి చెప్పారు.  కార్యకర్తలకు ఏదైనా జరిగితే సర్కార్ అంతు చూస్తామని హెచ్చరించారు.
పాదయాత్ర శిబిరం వద్ద ‘‘కేసీఆర్ కుటుంబ దమన నీతిపై ధర్మదీక్ష’’కు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బండి సంజయ్ పాదయాత్ర శిబిరం వద్ద ముందుగానే మోహరించిన పోలీసులు ఆయన భద్రతా కారణాల దృష్ట్యే అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.  శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలరాస్తోందని బీజేపీ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ కుటుంబం పాత్రను తేల్చేంతవరకు తాము నిరసనలు కొనసాగిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
 
లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలంటూ సోమవారం బీజేవైఎం నేతలు కవిత ఇంటిదగ్గర ఆందోళన చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు బలవంతంగా కార్యకర్తలను అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. 
కాగా, సంజయ్ కుమార్ అక్రమ అరెస్ట్, పార్టీ శ్రేణులపై పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అన్ని మండలాల్లోని పార్టీ ఆఫీసుల వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన దీక్ష చేయనున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేలా చేపడుతున్న ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని పిలుపిచ్చారు. 
అరెస్ట్ తో ప్రజా సంగ్రామ యాత్రను ఆప్ ప్రసక్తి లేదని సంజయ్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యధావిధిగా భద్రకాళి ఆలయం వరకు కొనసాగిస్తానని ప్రకటించారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని విమర్శించారు. టిఆర్ఎస్ ఎంతగా రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా శాంతియుతంగా, గాంధేయ పద్దతిలో తమ నిరసనను వ్యక్తం చేయాలని ఆయన బిజెపి శ్రేణులకు పిలుపిచ్చారు.