బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‎ అరెస్ట్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‎ను మంగళవారం ఉదయం షాహీ నాయత్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్ట్ అనంతరం రాజాసింగ్ ను పోలీస్ వాహనంలో స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే అరెస్ట్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. ఎంఐఎం ఫిర్యాదుతో రాజాసింగ్‎పై కేసు నమోదు చేశారు.
 
ముహమ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారంటూ  హైదరాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. రాముడిని కించపర్చిన మునావర్‌ ఫారుఖీని హైదరాబాద్‌ తీసుకొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజాసింగ్ తొలుత హెచ్చరించారు.
 
 ‘‘నేను హెచ్చరించినా మునావర్‌తో షో జరిపించారు, పోలీసులకు నేను ముందే దండం పెట్టి వేడుకున్నా, అయినా వినలేదు, మునావర్‌కు కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పాను’’ అని రాజాసింగ్ తెలిపారు.రాజాసింగ్ అలా చేసిన వీడియోను యూట్యూబ్‌లో పెట్టడంతో వివాదం చెలరేగింది. 
 
ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని డిమాండు చేస్తూ  సోమవారం రాత్రి హైదరాబాద్ నగరంలో ముస్లింలు నిరసన తెలిపారు. హైదరాబాద్ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కార్యాలయం ఎదుట, పాత నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
 
 బషీర్ బాగ్‌లోని కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.గత వారం హైదరాబాద్‌లో హాస్యనటుడు మునావర్ ఫరూఖీ నిర్వహించిన ప్రదర్శనపై బీజేపీ ఎమ్మెల్యే కామెడీ వీడియోను విడుదల చేశారు.
 
కాగా, రెండో భాగానికి సంబంధించిన వీడియోను కూడా త్వరలో అప్ లోడ్ చేస్తాననని రాజాసింగ్ వెల్లడించారు. తాను రెండోభాగం వీడియోను త్వరలో అప్‌లోడ్ చేస్తానని స్పష్టం చేశారు. యాక్షన్‌కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుందని ఆయన చెప్పారు. తనపై ఎలాంటి చర్యలకు దిగినా ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని తెలిపారు.  .హైదరాబాద్ నగరంలో జరుగుతున్న పరిణామాలకు మంత్రి కేటీఆర్‌దే  బాధ్యత అని,తనపై ఎన్ని కేసులు నమోదు చేసినా తగ్గేది లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ వివరించారు.