పోలవరం నిర్వాసితులకు కొత్త ఆర్ ఆర్ ప్లాన్ ప్రకటించాలి

పోలవరం నిర్వాసితుల కోసం తాజాగా సర్వే నిర్వహించి కొత్త ఆర్ ఆర్ ప్లాన్ ప్రకటించి, అమలు జరపాలని ఆంధ్ర ప్రదేశ్ ఎస్సి,  ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక డిమాండ్ చేసింది. నిర్వాసితుల కాలనీలోకి,  వరద రాదని భావించిన గ్రామాలలోకి కూడా ముంపు నీరు రావడంతో ప్రభుత్వ అంచనాలు, ప్రయత్నాలు, ప్రయత్నాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు ఆందోళన వెలుబుచ్చారు.
రెండు రోజుల పాటు విజయవాడలో జరిగిన సమావేశాలలో ఆమోదించిన సమావేశంలో పోలవరం బహుళార్ధకసార్ధక ప్రాజెక్ట్ కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎనిమిది మండలాల పరిధిలోని 343 గ్రామాలకు చెందిన 2 లక్షల మందికి పైగా ప్రజలు నిర్వాసితులయ్యారని తెలిపింది. వీరిలో సగం మందికి పైగా వనవాసీయులే అని పేర్కొన్నది.
గోదావరి వరదల కారణంగా ఈ ప్రాంతాల ప్రజలు ఉన్నఫలంగా కొండలు, గుట్టలు ఎక్కవలసి వచ్చిందని, వారికి ఆహారం కాదు గదా తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందని వివరించింది. పోలవరం ప్రాజెక్ట్ తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నందున, ఎంతమేర అప్పుడే నీరు నిల్వ చేయకపోవడంతో తొలుత 34 గ్రామాల ప్రజలు మాత్రమే ముంపుకు గురవుతారని అంచనా వేశారని గుర్తు చేసింది.
ఆ మేరకు ప్రజలను తరలించి, పునరావాస కాలనీల ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే, ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేస్తూ, ఆ మేరకు కాకుండా కనీస స్థాయిలో కూడా నీటి మట్టం చేరుకోకుండానే 343కు పైగా గ్రామాలు నీట మునిగాయని వేదిక ఆందోళన వ్యక్తం చేసింది.  పోలవరం మండలంలో 19, కుక్కునూరు మండలంలో 73, వేలేరుపాడు మండలంలో 36, చింతూరు మండలంలో 24, ఎటపాకలో 40, కూనవరం 78, వర రామచంద్రాపురంలో 73 ముంపుకు గురయ్యాయి. భద్రాచలం వద్ద నీటి మట్టం 60 అడుగులకు చేరగానే వరదలు ఉధృతం అయ్యాయి.
పైగా, కొత్తగా నిర్మించిన కాలనీలు కూడా నీట మునిగితే వీటిని  ఏ ఉద్దేశ్యంతో  నిర్మించారనే ప్రశ్న తలెత్తుతున్నదని వేదిక స్పష్టం చేసింది. ఆ ప్రాజెక్ట్ పూర్తయి నీటిని నిల్వచేస్తే తమ పరిస్థితి ఏమిటనే గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నట్లు తెలిపింది.  ఇటీవల వచ్చిన వరదలను ఓ గుణపాఠంగా ప్రభుత్వం తీసుకొని, ఎత్తైన సురక్షిత ప్రాంతాలలో పునరావాస కాలనీలను నిర్మించాలని ఎస్సి,  ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక డిమాండ్ చేసింది. కొత్తగా కాంటూరు సర్వే జరిపి కాంటూరు పరిధిలోని గ్రామాల సంఖ్యను పెంచాలని సూచించింది. 
 
ఆంధ్ర ప్రదేశ్ పాలకులు పోలవరం ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేయాలని తొందర పడుతున్నారే గాని ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో నిర్వాసితులయ్యే గిరిజనులకు సరైన పునరావాసం చేపట్టాలనే కోర్కె గాని, ప్రయత్నం గాని రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించడం లేదని వేదిక విమర్శించింది. 
గిరిజన ప్రాంతాలలో ఆక్రమణలు కట్టడి చేయాలి 
 
1/70 చట్టం ప్రకారం ఛేడ్యూల్ ఏరియాలలో రాజ్యాంగం కల్పించిన భూమి హక్కు మేరకు గిరిజన ప్రాంతాలలో భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా ఆ ప్రాంత గిరిజనులకు మాత్రమే హక్కు ఉంటుంది. గిరిజనులేతరులకు ఈ భూమి కొనే హక్కు గాని, వాటిల్లో  ఇల్లు కట్టే హక్కు గాని లేదు.
 
 అయితే, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరులు భూములు కొనడం, నిర్మాణాలు చేపట్టడం, వ్యవసాయం చేస్తుండడం జరుగుతూ ఉండడం పట్ల ఎస్సీ,  ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిగి, గిరిజనుల ఉనికికి ప్రమాదకరమైన ఈ ఆక్రమణదారులు కట్టడి చేయాలని డిమాండ్ చేసింది. 
 
1985లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ జారీచేసిన జీవో నం 3 ప్రకారం అన్ని ప్రభుత్వ సంస్థలలో ఉపాధ్యాయ పోస్టులను గిరిజన మాండలికం, యాస ఆధారంగా గిరిజనులను ఉపాధ్యాయులుగా నియమించాలి. అటువంటి జిఓను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేయడం  అమానుషమని వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ జిఓ ను యధావిధిగా కొనసాగించాలని వేదిక డిమాండ్ చేసింది. 
 
గిరిజనులకు తమకంటూ ప్రత్యేకమైన పూజా పద్ధతులు,  పండుగలు, తెగల కట్టుబాట్లు, పెళ్లిళ్లు విభిన్న పద్దతులలో భారత దేశానికి ఆదర్శవంతంగా ఉన్నాయి. అయితే  క్రైస్తవ మిషనరీలు, ముస్లింలు గిరిజనులను మతమార్పిడి గురిచేస్తూ గిరిజన సంప్రదాయాలను మంటగడుపుతున్నారని వేదిక ఆరోపించింది. 
 
మతం మారిన వారు గిరిజన గిరిజన సంప్రాదయాలను పాటించడం లేదని పేర్కొంటూ అటువంటి వారు గిరిజనులు ఏవిధంగా అవుతారని వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గిరిజన ఆచారాలు పాటించని వారికి ఎస్టీ ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వరాదని, ఇచ్చిన వారి పత్రాలు రద్దు చేయాలనీ వేదిక డిమాండ్ చేసింది. 
 
కొంతమంది గిరిజనేతరులు మోసపూరిత మాటలతో గిరిజన మహిళలను రెండో వివాహం చేసుకొని, వారితో పుట్టిన బిడ్డల పేర్లతో రిజర్వేషన్ తో  కొనుగోలు చేస్తూ గిరిజనుల హక్కులను అక్రమంగా అనుభవిస్తున్నారని వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ వివాహ చట్ట ప్రకారం తండ్రి వారసత్వం, రిజర్వేషన్ మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. 
 
గిరిజన వివాహ చట్ట ప్రకారం తల్లి వారసత్వం, రిజర్వేషన్ వర్తింపవని తాజాగా బీహార్ కు చెందిన అంజాన్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు గిరిజన మహిళతో గిరిజనేతర పురుషునికి పుట్టిన సంతానానికి రేజర్వేషన్లు వర్తింపవని తీర్పు ఇవ్వడం పట్ల వేదిక హర్షం ప్రకటించింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనీ వేదిక డిమాండ్ చేసింది.