
మంత్రివర్గ విస్తరణతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే బీమా భారతి నుండి వ్యతిరేకత ఎదురైంది. జెడి(యు) ఎమ్మెల్యే లేషి సింగ్‌కు కొత్త కేబినెట్‌లో మంత్రి పదవి దక్కగా, తనకు మాత్రం మొండిచెయ్యి చూపారంటూ బీమా భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
లేషి సింగ్ మంత్రిగా కొనసాగితే తాను రాజీనామా చేస్తానని ఆమె హెచ్చరించారు. లేషి సింగ్ ప్రతిసారీ తన నియోజకవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తుందని, అలాంటి వ్యక్తిని కేబినెట్ లోకి తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆమె ప్రశ్నిస్తూ లేషిసింగ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను వెనుకబడిన కులానికి చెందినందున తనను మంత్రిగా నియమించలేదని ఆమె మండిపడ్డారు.
అయితే లేషిసింగ్ 2013, 2014, 2019లో కూడా మంత్రిగా ఉన్నారని, అప్పుడు ఇలాంటి ఆరోపణలు రాలేదని, ఇవన్నీ అర్థరహితమని నితీష్ కుమార్ కొట్టిపారేశారు. ప్రతిసారీ ప్రతి ఒక్కరికీ మంత్రిని చెయ్యలేమని నితీష్‌కుమార్ స్పష్టం చేశారు. బీమా భారతి కూడా రెండు సార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. ఆమెతో చర్చలు జరుపుతామని, అర్థం చేసుకుంటే సరేనని.. లేకుంటే పార్టీని వీడి వెళ్లవచ్చని స్పష్టం చేశారు.
ఆమె సక్రమంగా చదవలేకపోయినప్పటికీ ఆమెకు రెండుసార్లు మంత్రి పదవిని ఇచ్చామని, తాము ఆమెకు గొప్ప గౌరవం ఇచ్చామని నితీష్ చెప్పారు. తనను బుధవారం కలవాలని ఆమెకు చెప్పానని, అయితే ఆ అవసరం లేదని ఆమె తన కార్యాలయానికి సమాచారం ఇచ్చారని, అందుకే తాను నేడు ఈ ప్రకటన చేశానని తెలిపారు.
ఫుడ్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మంత్రిగా ఉన్న లేషి సింగ్ ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించారు. ఆర్‌జెడి పొత్తుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్‌కుమార్ మంగళవారం మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా, . ఆర్జేడీకి చెందిన కార్తికేయ సింగ్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆయన కిడ్నాప్ కేసులో నిందితుడు కావడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
More Stories
కర్ణాటకలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం కోటా
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!
పోక్సో కేసులో మాజీ సిఎం యడియూరప్పకు ఊరట