సంజయ్ యాత్రపై దాడి.. ఎర్రబెల్లిపై కేసు నమోదు చేయాలి: అరుణ

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పై టిఆర్ఎస్ నాయకుల దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి  డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. సోమవారం పాలకుర్తి నియోజకవర్గం , దేవరుప్పుల టౌన్ లో పాదయాత్ర నిర్వహిస్తుండగా, తెరాస గుండాలు యాత్ర పై దాడి చేయడంపై ఆమె మండిపడ్డారు.
 
 వెంటనే పోలీసులు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పై కేసు నమోదు చేయాలని అరుణ డిమాండ్ చేసారు. పార్లమెంట్ సభ్యులు, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ముందస్తు అనుమతితో పాదయాత్ర చేస్తుంటే రక్షణ కల్పించలేని అసమర్ధ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదని ఆమె నిప్పులు చెరిగారు.
పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి తొత్తులా వ్యవహరించకుండా ,ప్రజాస్వామ్యయుతంగా తమ విధులను నిర్వర్తించాలని ఆమె హితవు చెప్పారు.  తెలంగాణ ప్రజలు కష్టాలు పడుతుంటే వారి బాధలు వినడానికి ఫామ్ హౌస్ దాటి బయటికి రాలేని కెసిఆర్, ప్రజలతో మమేకమవుతున్న బిజెపి నాయకులు కార్యకర్తలపై, వరుసగా దాడులు చేయించడం వారి పిరికిపందతనానికి నిదర్శనమని ఆమె ఎద్దేవా చేశారు. 
గతంలో సంజయ్ ఉద్యోగుల కోసం శాంతియుతంగా ధర్నా చేస్తుంటే, పోలీసులు కట్టర్లతో దౌర్జన్యంగా వారి కార్యాలయాన్ని ధ్వంసం చేసి మరి అరెస్టు చేసిన ఘటన మరువకముందే, ఈరోజు పోలీసుల సమక్షంలోనే ప్రజా సంగ్రామ యాత్రలో టిఆర్ఎస్ గుండాలు బిజెపి కార్యకర్తలపై దాడులు చేయడం టిఆర్ఎస్ అసహనాన్ని తెలియజేస్తుందని ఆమె ధ్వజమెత్తారు.
 
ఒక్క రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇంతలా విర్రవీగితే దేశంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ కార్యకర్తలు ఎదురు తిరిగితే ఇక్కడి టిఆర్ఎస్ పార్టీ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండని ఆమె హెచ్చరించారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దగ్గరికి వెళ్లి వారితో మమేకమై వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న బిజెపిపై దాడులు చేయడం అంటే ప్రజలపై నేరుగా దాడులు చేసినట్టేనని ఆమె స్పష్టం చేశారు. 
 
బిజెపి ఎదుగుదలను తట్టుకోలేక టిఆర్ఎస్ ,కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరిస్తూ ఉండడంతో, వాళ్ల బండారం ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుండడంతో అధికార పీఠాలు కదిలి ఇలా భౌతిక దాడులకు దిగుతున్నారని అరుణ విమర్శించారు. కేసీఆర్ కు ఏ మాత్రం ధైర్యం, దమ్ము ఉన్నా  ప్రజాక్షేత్రంలో నేరుగా బిజెపిని ఎదుర్కోవాలని ఆమె సవాల్ చేశారు.
అంతేకానీ మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినట్టు ప్రజా సంగ్రామ యాత్రపై దాడులకు దిగితే బిజెపి చెప్పే సమాధానం ఇక టిఆర్ఎస్ పార్టీకి అర్థమయ్యే రీతిలోనే ఉంటుందని అరుణ హెచ్చరించారు.