ప్రపంచంలోనే అత్యధికంగా భారత్ లో మహిళా విమాన పైలట్లు 

నివేదిత భాసిన్ 1989లో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన కమర్షియల్ ఎయిర్‌లైన్ కెప్టెన్‌. మొదట్లో తనను చూస్తే ఓ మహిళా తమ విమానాన్ని నడుపుతుందా అని ప్రయాణికులు భయపడతారని ఇతర సిబ్బంది తనను కాక్‌పిట్‌లోకి పరుగెత్తమని కోరిన సంగతి ఆమె ఇంకా మరచిపోలేదు. ఆ రోజులలో భారతదేశంలో  మహిళా పైలట్లు చాలా అరుదు. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా మహిళా పైలట్ లు మనదేశంలో ఉన్నారు.
ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఉమెన్ ఎయిర్‌లైన్ పైలట్ల అంచనా ప్రకారం, భారత దేశంలో మొత్తం పైలట్లలో 12.4 శాతం మంది మహిళలు ఉండగా, ప్రపంచంలోని అతి పెద్ద విమానయాన మార్కెట్ అయిన అమెరికాలో 5.5 శాతం, బ్రిటన్లో 4.7 శాతం మంది ఉన్నారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లింగ సమానత్వం ఆధారంగా దేశాల ర్యాంకింగ్‌లో 146 దేశాలలో 135వ స్థానంలో నిలిచిన భారత్ ఈ నిర్దిష్ట పరిశ్రమలో ట్రెండ్‌ను ఎలా తిప్పికొట్టగలిగింది అనే ప్రశ్నలను గణాంకాలు లేవనెత్తుతున్నాయి. కొన్ని అధ్యయనాలు మహిళా పైలట్‌లకు తక్కువ భద్రతా పరమైన సమస్యలు ఎదురైనట్లు స్పష్టం చేస్తున్నాయి.
కరోనా మహమ్మారి నుండి ప్రపంచం ఉద్భవించి, డిమాండ్ పుంజుకోవడంతో ప్రయాణానికి అంతరాయం కలిగించే సిబ్బంది కొరతను పరిష్కరించడంలో ఎక్కువ మంది మహిళలను నియమించుకోవడం కూడా విమానయాన సంస్థలకు సహాయ పడుతుంది.

ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ల నుండి మెరుగైన కార్పొరేట్ విధానాలు, బలమైన కుటుంబ మద్దతు వరకు అనేక కారణాల వల్ల భారతీయ మహిళలకు ఈ రంగంలో ప్రోత్సాహం లభిస్తున్నట్లు భాసిన్ చెప్పారు. చాలా మంది భారతీయ మహిళలు 1948లో ఏర్పడిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్  ఎయిర్ వింగ్ ద్వారా ప్రయాణించడానికి ఆకర్షితులయ్యారు. ఇది ఒక రకమైన యువజన కార్యక్రమం, ఇక్కడ విద్యార్థులు మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆపరేట్ చేయడానికి శిక్షణ పొందుతారు. 

 
ఖరీదైన కమర్షియల్ పైలట్ శిక్షణను మహిళలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీని ఇస్తున్నాయి.  హోండా మోటార్ వంటి కంపెనీలు ఇండియన్ ఫ్లయింగ్ స్కూల్‌లో 18 నెలల కోర్సు కోసం పూర్తి స్కాలర్‌షిప్‌లను ఇవ్వడంతో పాటు,  వారికి ఉద్యోగాలు పొందడంలో సహాయపడుతున్నాయి.

ఫ్లోరిడాలోని ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్,  డైవర్సిటీ ఇనిషియేటివ్స్ డైరెక్టర్ మిచెల్ హల్లెరన్ మాట్లాడుతూ, “పైలట్‌లతో సహా కీలక స్థానాల్లోకి మహిళలను నియమించడం భారతదేశం దశాబ్దాల క్రితమే ప్రారంభించింది. అమెరికాలో మా ప్రస్తుత తీవ్రమైన పైలట్, టెక్నీషియన్ కొరత కారణంగా విమానయానంలో వైవిధ్య ఉద్యమం కోసం ఆలస్యంగా ప్రారంభించాము” అని తెలిపారు.

భారత వైమానిక దళం 1990లలో హెలికాప్టర్లు, రవాణా విమానాల కోసం మహిళా పైలట్‌లను నియమించడం ప్రారంభించింది. ఈ సంవత్సరం వరకు వారిని యుద్ధాలలో పాల్గొనడానికి  అనుమతించలేదు. భారతదేశంలోని కొన్ని విమానయాన సంస్థలు మహిళా ప్రతిభను నిలుపుకోవడానికి విధానాలను రూపొందిస్తున్నాయి. 

 
అతి పెద్ద ప్రయాణీకుల విమానయాన సంస్థ అయిన ఇండిగో, మహిళా పైలట్‌లు సిబ్బందికి గర్భధారణ సమయంలో ఫ్లయింగ్ డ్యూటీలు మినహా సురక్షితంగా పని చేసే సౌలభ్యం కలిగిస్తున్నది.  ఇది చట్టం ప్రకారం అవసరమైన 26 వారాల పెయిడ్ మెటర్నిటీ లీవ్‌ను అందిస్తుంది. పిల్లల సంరక్షణ కోసం క్రీచ్‌లను కూడా అందిస్తుంది. మహిళా పైలట్లు పిల్లలకు 5 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఒక క్యాలెండర్ నెలలో రెండు వారాల సెలవు పొందే సౌకర్యవంతమైన ఒప్పందాన్ని ఎంచుకోవచ్చు. 
 
విస్తారా గర్భిణీ పైలట్‌లు, క్యాబిన్ సిబ్బందికి గ్రౌండ్‌లో తాత్కాలిక ఉద్యోగాలు లేదా వారు ఎగరడానికి సిద్ధంగా ఉన్నంత వరకు పరిపాలనా విధులను కల్పిస్తుంది. ఆరు నెలల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇస్తుంది. క్రెచ్ ఫీజును రీయింబర్స్ చేస్తుంది. కొన్ని క్యారియర్‌లు ఆలస్యంగా ప్రయాణించే మహిళలను డ్రాప్ చేయడానికి, పికప్ చేయడానికి డ్రైవర్, గార్డును కూడా నియమిస్తారు.

భారత దేశంలోని కుటుంభం వ్యవస్థ సహితం మహిళా పైలట్ లకు సౌలభ్యం కలిగిస్తున్నది.  తాతలు, అత్తలు తరచుగా పిల్లలను పెంచడంలో లేదా గృహాలను నిర్వహించడంలో సహాయపడతారు.  ఇది చాలా గంటలపాటు ఇంటి నుండి దూరంగా ప్రయాణించాల్సిన పరిశ్రమలో ప్రత్యేకంగా సహాయపడుతుందని పైలట్లు చెబుతున్నారు.

గత సంవత్సరం శాన్ ఫ్రాన్సిస్కో నుండి బెంగళూరుకు ఎయిర్ ఇండియా మొట్టమొదటి నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను పూర్తిగా మహిళా సిబ్బందితో నడిపినప్పుడు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. “నాలాంటి మహిళలు ఐదు రోజుల పాటు శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లవచ్చు.  ఇంట్లో ఏమి జరుగుతుందో ఆలోచించనవసరం లేని సౌలభ్యం ఉంది” అని జోయా అగర్వాల్ తెలిపారు.

అయితే మహిళా పైలట్ల మొత్తం సంఖ్య ఇప్పటికీ భారతదేశంలో కంటే అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగానే ఉంది. ఎందుకంటే అమెరికా  వంటి ప్రదేశాలలో విమానయాన మార్కెట్లు చాలా పెద్దవ కావడంతో సిబ్బంది సంఖ్యా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 


అయినప్పటికీ, ఎక్కువ మంది మహిళలను నియమించుకోవడం వల్ల పైలట్‌లు, విమానాశ్రయ ఉద్యోగుల నిరంతర లోటును తగ్గించవచ్చు, రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచానికి 6,00,000 కంటే ఎక్కువ కొత్త పైలట్లు అవసరమని బోయింగ్ కో అంచనా వేసింది.

విమాన ప్రయాణ భద్రత విషయంలో భారత్ అభివృద్ధి చెందిన దేశాలకంటే చాల మెరుగుగా ఉంది.  ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ ప్రకారం, 1945 నుండి అమెరికాలో భారతదేశం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ ప్రాణాంతక విమాన ప్రమాదాలు జరిగాయి. బ్రిటన్ లో మరో 15 ఘోరమైన సంఘటనలు జరిగాయి. భారత్ లో కంటే అమెరికాలో విమాన మార్కెట్ చాలా పెద్దది కావడం కూడా ఒక కారణం కావచ్చు. అయితే, మహిళా పైలట్ ల సంఖ్య  పెరగడం విమాన ప్రయాణ భద్రతను మెరుగుపరుస్తుందని పలువురు భావిస్తున్నారు.


1983 నుండి 1997 మధ్యకాలంలో విమానం, హెలికాప్టర్ క్రాష్ డేటాను అంచనా వేసిన జెండర్ డిఫరెన్సెస్ ఇన్ జనరల్ ఏవియేషన్ క్రాష్‌లు అనే ఒక అధ్యయనం, పురుష పైలట్‌ల క్రాష్ రేట్లు మహిళల కంటే ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. అమెరికా ఆర్మీ హెలికాప్టర్ పైలట్‌లలో 10 శాతం మంది ఉన్నప్పటికీ మహిళలు విమానాలను “మరింత సురక్షితంగా” నడుపుతూ కేవలం 3 శాతం ప్రమాదాలకు కారణమవుతున్నారు, ఉమెన్ ఇన్ కంబాట్ ఆర్మ్స్: ఎ స్టడీ ఆఫ్ ది గ్లోబల్ వార్ ఆన్ టెర్రర్ ప్రకారం, 2002 నుండి 2013 వరకు ఈ అధ్యయనం జరిపారు.

ఇండియన్ ఫ్లైట్ స్కూల్ ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ చీఫ్ ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ కుంజాల్ భట్ మాట్లాడుతూ, ఈ వృత్తిని కొనసాగించడానికి సామాజిక నిబంధనలకు విరుద్ధంగా శ్రమపడే వారు ఎక్కువగా ఉన్నందున “కచ్చితమైన” విజయం సాధించడానికి ఎక్కువ అంకితభావాన్ని ప్రదర్శిస్తున్న మహిళా ట్రైనీలను తాను కనుగొన్నానని చెప్పారు.

విమానయాన పరిశ్రమలో విజయం సాధించిన భారతీయ మహిళలు విమానయానం గురించి బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. 2020లో అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారతీయ విమానయాన సంస్థకు నాయకత్వం వహించిన మొదటి మహిళ అయిన హర్‌ప్రీత్ ఎ దే సింగ్, పైలట్లు, టెక్నీషియన్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లతో సహా ఉద్యోగాలపై అవగాహన పెంచడానికి పాఠశాలల్లో ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నారు.

“కొంతకాలం పాటు దేశవ్యాప్తంగా ఈ స్థిరమైన ప్రయత్నం కారణంగా కొందరికి అసలు ఇటువంటి వృత్తి ఉన్నదని తెలియకుండానే పెద్ద సంఖ్యలో మహిళలు ఈ వృత్తిని ఎంచుకునేలా చేసింది” అని సింగ్ చెప్పారు.