పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా కేసీఆర్!

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే.. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్‌ఎ్‌సలో చేరిన వారందరితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. నైతిక విలువలుంటే ఉప ఎన్నికల్లో పోటీకి రావాలని పిలుపునిచ్చారు. 
 
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తొమ్మిదో రోజైన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం, రామన్నపేట, దుబ్బాక, మునిపంపుల గ్రామాల్లో సంజయ్‌ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
 
‘మీరు రాముడి వారసులైతే బీజేపీకీ ఓటేయాలి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు అధికా రం ఇచ్చారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి’ అని ప్రజలను కోరారు.వ్యాట్‌ పేరుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.30 దోచుకుంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించాలని ఆందోళనలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. 
 
చేనేత బీమా, ఇంటికో ఉద్యోగం, రైతులకు రూ.లక్ష రుణమాఫీ, దళితులకు మూడు ఎకరాల భూమి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్‌ వరి వేసి కోటీశ్వరుడయ్యాడని, అదే వరి పండించిన రైతులను బికారులను చేశాడని మండిపడ్డారు. తన ఫాంహౌ్‌సకు నీళ్లు తెచ్చుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్లు ఖ ర్చు చేశాడని గుర్తు చేశారు. 
 
ఇక్కడ రూ.700 కోట్లు ఖర్చు చేస్తే ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని, పి ల్లాయిపల్లి కాలువలు పూర్తవుతాయని సంజయ్ చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదిముర్మును ఓడించేందుకు కేసీఆర్‌ కాంగ్రెస్‌తో చేతులు కలిపాడని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే జైలులో పెడుతున్నారని ధ్వజమెత్తారు. 
 
కేసీఆర్‌ అంటే ఖాసీం చంద్రశేఖర్‌ రజ్వీ అని, కేటీఆర్‌ అంటే సయ్యద్‌ మక్బూల్‌ అని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే గతంలో ఇచ్చిన హామీలు కేసీఆర్‌కు గుర్తుకొస్తాయని ధ్వజమెత్తారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు హక్కుగా 575 టీఎంసీలు రావాల్సి ఉండగా 299 టీఎంసీలు మాత్రమే వచ్చేలా కేసీఆర్‌ అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. 
ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ తెలంగాణలో ఏ సర్వే చూసినా బీజేపీ అధికారంలోకి వస్తుందని వెల్లడిస్తున్నాయని తెలిపారు. సంజయ్‌ 9వ రోజు 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.