ఎంపీల వినతి మేరకే పార్లమెంట్‌ సమావేశాల వాయిదా

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ఎంపీల వినతి మేరకే షెడ్యూల్‌కు రెండు రోజులు ముందుగానే నిరవధికంగా వాయిదా వేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, గౌరవ్ గొగాయ్ చేసిన  తోసిపుచ్చారు.  పార్లమెంట్‌ సమావేశాలను షెడ్యూల్‌ ప్రకారం ఆగస్ట్‌ 12 కంటే ముందుగానే ముగించడం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని, సభను నడిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని కాంగ్రెస్‌ పార్టీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.
సభలో చర్చ జరగాలంటూ బయటకు చెప్పుకుంటూ అంతరాయం కలిగించడం, వాకౌట్‌ చేయడం ప్రతిపక్షాల ఎజెండాగా మారిందని విమర్శించారు. వారు రూల్ 377, జీరో హౌర్, ప్రశ్నోత్తరాల సమయంలో  ఏ  ప్రజా సమస్యనైనా ప్రస్తావింపవచ్చని  పేర్కొన్నారు. అయితే చర్చలు జరగాలని కోరుతున్నవారు ధరల పెరుగుదలపై చర్చ జరుగుతూ ఉండగా  సభ నుండి ఎందుకు వెళ్లిపోయారని ఆయన ప్రశ్నించారు.
 ‘ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా వర్షాకాల సమావేశాలను షెడ్యూల్‌ కంటే 4 రోజులు కాదు, 2 రోజులు ముందుగా వాయిదా వేశాం. ప్రతిపక్ష సభ్యులు సహా పలువురు ఎంపీలు చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని పేర్కొన్నారు. తాజా సమావేశాలలో సగంకు పైగా సమయం చర్చలు జరుపకుండా అడ్డుకున్నారని చెబుతూ, ప్రజలు వారి చర్యలను ఏవగించుకొంటున్నటు ఒకొక్క రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ సభలో కాంగ్రెస్‌ చేపట్టిన నిరసనలపై ఆయన స్పందిస్తూ..‘అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక కుటుంబం వ్యక్తిగత సమస్యలపై పార్లమెంట్‌ సమయాన్ని వృథా చేశారు. ప్రజాప్రయోజనాల కంటే ఒక కుటుంబాన్ని రక్షించడానికే ఎక్కువ ఆసక్తి చూపారు’అని ఎత్తిపొడిచారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, రాహుల్‌ని ఈడీ పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
విద్యుత్ (సవరణ) బిల్లు, 2022ను ఆమోదింపకుండా తాము అడ్డుకున్నామని కాంగ్రెస్ చేస్తున్న  వాదనలను ప్రహ్లాద్ జోషి కొట్టి పారవేశారు.  ప్రభుత్వం ఆ  బిల్లును కేవలం సభలో ప్రవేశ పెట్టినదని, దానిపై విస్తృతమైన చర్చ జరుగవలసి వలసి ఉన్నందున స్థాయీసంఘంకు పంపినదని తెలిపారు.