దేశ విభజన నాటి భయానక సంఘటనలపై ప్రదర్శనలు

దేశ విభజన ఆధునిక భారత దేశ చరిత్రలో అత్యంత విషాదకర పరిణామం. ఎటువంటి చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక నేపధ్యం, ప్రాతిపదిక లేకుండా కేవలం వలస  పాలకులైన బ్రిటిష్ వారి కుట్రపూరిత ఎత్తుగడలకు, స్వార్ధపరులైన కొందరు భారత రాజకీయ నాయకులు తోడవడంతో అత్యంత అమానుషంగా ఈ విభజన జరిగింది. 

ఈ సందర్భంగా జరిగిన దారుణమైన హింసాకాండ, అమాయక ప్రజల ఊచకోత, లక్షలాది మంది ప్రజలు తమ ఆస్తులను, ఉద్యోగ- వ్యాపారాలను వదులుకొని,  ప్రాణాలను చేతిలో పట్టుకొని పారిపోయి రావడం, అటువంటి వారి పట్ల నాటి పాలకులు ఓ విధమైన వివక్షాపూరిత ధోరణి ప్రదర్శించడం మరచిపోలేని విషాద సంఘటనలు.

భారత ప్రజలు ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్ జరుపుకొంటున్న సమయంలో నాటి విషాద ఘటనలను ఓ గుణపాఠంగా గుర్తుంచుకొని విధంగా చేయడం కోసం  కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మాల్స్ వంటి ముఖ్యమైన బహిరంగ ప్రదేశాల్లో ఆగస్టు 10 నుంచి 14 వరకు ప్రదర్శనలను నిర్వహించాలని నిర్ణయించింది.

సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు ఈ విషయాలు తెలిసే విధంగా రైల్వే స్టేషన్ల ప్రాంగణాలలో ఈ ఎగ్జిబిషన్లను నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. దేశ విభజన  సమయంలో ప్రజలు ఎదుర్కొన్న అత్యంత దారుణమైన పరిస్థితులను వివరించేందుకు బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, పెట్రోలు బంకులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, వృత్తివిద్యా శిక్షణ కేంద్రాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలను నిర్వహించాలని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశ విభజననాటి విషాదం  గురించి గరిష్ఠ స్థాయిలో ప్రజలు తెలుసుకునేలా చేయాలని తెలిపింది.

ఈ ప్రదర్శనలకు హాజరయ్యే ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా తెలిపింది. ఆగస్టు 14ను దేశ విభజన భయానక పరిస్థితులను గుర్తు చేసుకునే రోజుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. 

దేశ విభజన సమయంలో లక్షలాది మంది అనేక ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఆవేదన అనుభవించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు. గత శతాబ్దంలో అత్యధిక స్థాయిలో ప్రజలు నిర్వాసితులవడం దేశ విభజన సమయంలోనే జరిగింది. వీటన్నిటినీ ప్రజలకు తెలియజేయడం కోసమే పార్టిషన్ హారర్స్ రిమంబ్రెన్స్ డేను నిర్వహిస్తున్నారు. 

రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ వీకే త్రిపాఠికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ రాసిన లేఖలో, రైల్వేలు ఎక్కువ మంది ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉందని, అందువల్ల రైల్వే స్టేషన్ల వద్ద, దాదాపు 700 చోట్ల ఈ ఎగ్జిబిషన్లను నిర్వహించాలని కోరారు. దేశ విభజన ప్రభావిత ప్రజల బాధలు, ఆవేదనను ప్రస్తుత తరానికి తెలియజేయడం కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సంయుక్తంగా ఈ ఎగ్జిబిషన్లను రూపొందించినట్లు తెలిపారు. 

ఈ ప్రదర్శనను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వెబ్ సైట్‌లో డిజిటల్ ఫార్మేట్‌లో ఆంగ్లం, హిందీలలో కూడా చూడవచ్చు. ఈ అంశం చాలా సున్నితమైనది కాబట్టి తగిన సంయమనం, గంభీరతతో ఈ ప్రదర్శనలను నిర్వహించాలని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సమాజంలోని ఏదైనా వర్గం మనోభావాలు దెబ్బతినడానికి అవకాశం ఇవ్వవద్దని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రామాణిక నిర్వహణ విధానాలను తెలియజేసింది.

దాదాపు 200 సంవత్సరాలపాటు బ్రిటిష్ పాలనలో ఉన్న భారత దేశం 1947లో రెండు వేర్వేరు దేశాలుగా విడిపోయింది. భారత దేశం, పాకిస్థాన్ ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న దారుణాలను ఈ ఎగ్జిబిషన్లలో వివరిస్తారు.