శ్రీలంక రేవుకు చైనా యుద్ధ నౌక కదలికలతో భారత్ కలవరం

అత్యంత శక్తివంతమైన అధునాతన సాధన సంపత్తి గల చైనా యుద్ధ నౌక చైనా నుంచి శ్రీలంక రేవుకు బయలుదేరింది. బాలిస్టిక్ క్షిపణులను, శాటిలైట్లను పసికట్టి వాటిని పనిచేయని స్థితికి తెచ్చే పరిజ్ఞానపు వ్యవస్ధతో కూడిన యువాన్ వాంగ్ శ్రేణి నౌక ఈ నెల 11 లేదా 12వ తేదీలలోనే లంకలోని హంబన్‌టోటా పోర్టుకు చేరుతుంది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి  శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి చైనా కుట్రపూరిత రుణాలేనని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్న సమయంలో తన అధీనంలో ఉన్న శ్రీలంక దక్షిణ ప్రాంతంలోని హమ్‌బన్‌తోటా పోర్టుకు పరిశోధన, సర్వే నౌకను పంపడం ఆందోళన కలిగిస్తున్నది.
 
ఈ చైనా నౌక కదలికలపై భారతదేశం రక్షణ పరంగా ఆందోళన చెందుతోంది. శ్రీలంకకు అత్యంత కీలకమైన తైవాన్ పరిణామాల నేపథ్యంలోనే చైనా నౌక బయలుదేరడం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అని మార్గమధ్యంలో పలు తీర ప్రాంత రేవు పట్టణాలు, కీలక సైనిక స్థావరాలు నెలకొని ఉన్న భారతదేశం కలవరం చెందుతోంది. 
 
మొత్తం 4 వందల మంది సిబ్బంది ఈ నౌకలో ఉంటారు. దీన్ని చైనా అంతరిక్ష విభాగంతో పాటు సైనిక విభాగం అధికారులు నియంత్రిస్తుంటారు. శాటిలైట్లను ఈ షిప్ పసిగడుతుంది. ఖండాంతర క్షిపణులను కూడా అచేతనం చేస్తుంది. ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానపు యాంటెనాలు, పలు సెన్సార్‌లను సంతరించుకుని ఉంది. ఇంతవరకు ఈ నౌక ఏ సముద్ర మార్గంలో వెళ్లుతుందనేది స్పష్టం కాలేదు.
అయితే ఇది హిందూ మహా సముద్ర జలాల మీదుగా వెళ్లితే తీ  ఒడిశా తీరం వెంబడి వీలర్ ఐలాండ్‌లో భారత్ చేపట్టే బాలిస్టి‌క్ క్షిపణి ప్రయోగాలను అంచనా వేయడానికి, వాటి సామర్థ్యంపై పూర్తి వాస్తవ స్థాయి సమాచారాన్ని రాబట్టుకోవడానికి చైనాకు వీలవుతుంది. అంటే భారత క్షిపణుల రేంజ్‌ను కచ్చితంగా అంచనా వేయడానికి ఈ నౌక ద్వారా చైనాకు వీలు చిక్కుతుంది.

సాధారణంగా వెళ్లుతూ ఉన్నట్లుగా ఉంటూనే దీని నుంచి భారత్ కు చెందిన పూర్తి స్థాయి రక్షణ సామర్థాలను, స్థితిగతులను అంచనావేసుకునేందుకు, రికార్డు చేసుకుని ముందుకు సాగేందుకు వీలేర్పడుతుంది.  ఆ మేరకు తరువాత చైనా తన సైనిక సామర్థతను పెంచుకునేందుకు దీనిని వాడుకోవచ్చునని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 

చైనాకు చెందిన ఈ నౌకను శ్రీలంక అనుమతించడంపై భారత్ ఆందోళనగా ఉంది. శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటోన్న ఆర్ధిక సంక్షోభం నుంచి కాపాడేందుకు చేయాల్సినంత చేస్తున్నా ఆ దేశం భారత్‌కు ఈ విషయంలో సహకరించలేకపోవచ్చని సమాచారం. ఈ నౌక వస్తున్నది శ్రీలంక ఆధీనం నుంచి చైనా పరమైన హంబన్ తోట ఓడరేవుకు కావడంతో శ్రీలంక ప్రభుత్వం నిస్సహాయతను వ్యక్తం చేసే అవకాశం ఉంది.  

ఇది అణ్వాయుధేతర నౌక కాబట్టి తమ రేవు పట్టణానికి దీనిని అనుమతిస్తున్నామని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. అయితే హిందూ మహాసముద్రంపై పూర్తిస్థాయి పర్యవేక్షణకు, నౌకాయాన ఆధిపత్యానికి దీనిని పంపిస్తున్నామని కూడా చైనా తెలిపిందని లంక రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా ప్రతినిధి కల్నల్ నళిన్ హెరాత్ తెలిపారు.

చైనా నౌక సోమవారం పోర్టుకు వచ్చే అంశంపై కేబినెట్‌ చర్చించినట్లు శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధి బందులా గుణవర్ధెన చెప్పారు. ‘తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో భారత్‌, చైనాలు మాకు సాయం అందించాయి.’ అని పేర్కొన్నారు. అయితే,  చైనా వల్లే దేశంలో పరిస్థితులు దిగజారాయనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఈ చైనా నౌక దగ్గరి దారులలో వెంటనే హిందూ మహా సముద్రంలోకి వస్తుంది. ఎక్కువగా భారతీయ తీర ప్రాంతాలపై నిఘా పెడుతూనే వెళ్లుతుంది. ఆ తరువాత ఇది లంక పోర్టులో ఎంతకాలం తిష్టవేస్తే అంతకాలం భారతదేశానికి పలు రకాల భద్రతా సవాళ్లు ఏర్పడుతాయని అనుమానిస్తున్నారు. ప్రస్తుత అంశంపై జాతీయ భద్రతా సంస్థ ఇంటెలిజెన్స్ వర్గాలతో క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.