మంకీపాక్స్ వైరస్ పై కేంద్రం తాజాగా మార్గదర్శక సూత్రాలు 

 దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 8 మంది ఈ వ్యాధి బారిన పడగా, ఒకరు మృతి చెందారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని సూచనలు చేసింది.
 
 “మంకీపాక్స్ బాధితులను తాకినా, వారికి దగ్గరగా ఉన్నా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి. వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసుకుందాం” అని కేంద్ర ఆరోగ్యశాఖ ట్విటర్‌లో వెల్లడించింది.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ఇటీవల మంకీపాక్స్‌ను అంతర్జాతీయ ఆందోళన కలిగించే గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.మంకీపాక్స్ అనేది ఒక వైరల్ జూనోసిస్..జంతువుల నుండి మానవులకు సంక్రమించే వైరస్ అని… వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ మశూచిని పోలి ఉంటుందని తెలిపింది. 
 
మంకీపాక్స్ ప్రారంభ దశలో జ్వరం, తలనొప్పి, వాపు, నడుం నొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్మాల్‌పాక్స్‌ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు లిపారు.
 
కేంద్రం జారీ చేసిన సూచనల ప్రకారం
* వ్యాధి సోకిన బాధితులను ఇతరులకు దూరంగా ఐసొలేషన్‌లో ఉంచండి. శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గేంతవరకు బాధితులు ఐసొలేషన్‌లో ఉండాలి.
* బాధితులు మూడు లేయర్ల మాస్క్ ధరించాలి. దద్దుర్లు బయటి గాలికి తగలకుండా చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.
* బాధితులకు సమీపంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్‌లు , చేతులకు గ్లౌజులు ధరించాలి.
* ఆ తరువాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. లేదా శానిటైజర్ రాసుకోవాలి.
* బాధితులు ఉన్న ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
చేయకూడనివి…
* మంకీపాక్స్ బాధితులు ఉపయోగించే దుస్తులు, టవళ్లు, పడకను కుటుంబంలో ఇతరులు వాడకూడదు.
* బాధితులు ఉపయోగించిన దుస్తులను మిగతా వారి దుస్తులతో కలిపి ఉతక్కూడదు. వాటిని ప్రత్యేకంగా శుభ్రం చేయాలి.
* మంకీపాక్స్ లక్షణాలు కన్పిస్తే బహిరంగ ప్రదేశాలకు వెళ్ల కూడదు.
* తప్పుడు సమాచారం నమ్మి బాధితులపై వివక్ష చూపకూడదు.