ఏపీ కోస్తా తీరానికి 20 శాతం పైన కోత ముప్పు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కోత ముప్పు ఎదుర్కొంటున్న తీర ప్రాంతం 20 శాతం పైనే ఉన్నట్లుగా ఇంకాయిస్‌ (ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ సర్వీసెస్‌) అధ్యయనంలో తేలినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు.  రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ రాష్ట్రంలోని 43.35 శాతం తీరానికి అతి తక్కువగాను, 33.27 శాతం తీరానికి ఓ మోస్తరు కోత ముప్పు ఉన్నట్లుగా ఇన్‌కాయిస్‌ అధ్యయనం పేర్కొనట్లు తెలిపారు.
కోత ముప్పు అతి తీవ్ర స్థాయిలో ఉన్న ప్రాంతం 0.55 శాతం ఉన్నట్లు మంత్రి చెప్పారు. సముద్రమట్టం పెరగకుండా నియంత్రించే చర్యల కోసం జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్డీఎంఎఫ్)కి రూ. 15 వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. దీనికి అదనంగా తీరప్రాంత కోత వలన నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరో రూ. 1,000 కోట్లు కేటాయించామని చెప్పారు.
జాతీయ స్థాయిలో నేషనల్ డిసాస్టర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ సంస్థను నెలకొల్పి 2021-22 నుంచి 2025-26 కాలానికి ఈ సంస్థకు రూ. 68,463 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.  ఈ నిధిని ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఎంఎఫ్‌ సంస్థలకు 80-20 నిష్పత్తిలో విభజించడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో ఎన్‌డీఎంఎఫ్‌ను నెలకొల్పింది. ఇలాంటి సంస్థలనే ఎస్‌డీఎంఎఫ్‌ పేరిట ఏర్పాటు చేయవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సలహా మేరకు ఇప్పటికి 21 రాష్ట్రాలు ఎస్‌డీఎంఎఫ్‌లను ఏర్పాటు చేశాయని మంత్రి వివరించారు.  సముద్ర కోతల వలన తీర ప్రాంతాలకు ఎదురవుతున్న ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు అందిస్తూ సాంకేతికపరమైన పరిష్కార మార్గాలను సూచిస్తున్నాయని ఆయన చెప్పారు.