రూపాయి విలువ కుప్పకూలి పోలేదు

రూపాయి విలువ కుప్పకూలిపోలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భరోసా ఇచ్చారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల  సమయంలో మాట్లాడుతూ  వాస్తవానికి అది తన సహజ మార్గాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు.
 భారతీయ రిజర్వు బ్యాంకు నిరంతరం స్థానిక కరెన్సీ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, కేవలం తీవ్రమైన మార్పులు సంభవిస్తున్నపుడు మాత్రమే జోక్యం చేసుకుంటోందని ఆమె తెలిపారు. భారతీయ రూపాయి  విలువను నిర్ణయించేందుకు ఆర్బీఐ జోక్యాలు ఎక్కువగా లేవని చెప్పారు. అది తన స్వంత, సహజ మార్గాన్ని నియంత్రణ లేకుండా అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు.
భారతీయ రూపాయి, అమెరికన్ డాలర్, తదితర కరెన్సీల మధ్య జరుగుతున్న తీవ్రమైన మార్పులను నియంత్రించడానికే ఆర్బీఐ ఎక్కువగా జోక్యం చేసుకుంటుందని ఆమె చెప్పారు.  ఆర్బీఐ జోక్యం చేసుకున్నప్పటికీ, అది రూపాయి విలువను నిర్ణయించడానికి కాదని, దాని విలువను తగ్గించడానికి లేదా పెంచడానికి కాదని ఆమె వివరించారు.
తీవ్రమైన మార్పులను నిరోధించేందుకు, దాని మార్గాన్ని దానిని అనుసరించడానికి అవకాశం కల్పించేందుకు మాత్రమే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందని ఆర్ధిక మంత్రి చెప్పారు. చాలా ఇతర దేశాల మాదిరిగానే భారత దేశం తన కరెన్సీని పొంతన లేని స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. మనం బలోపేతమయ్యేందుకు ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ అరమరికలు లేకుండా కలిసి పని చేస్తున్నాయని ఆమె భరోసా ఇచ్చారు.
భారతీయ రూపాయి తనతో దాదాపు సమాన స్థాయిలో ఉన్న కరెన్సీల కన్నా మెరుగైన పనితీరును కనబరచిందని ఆమె చెప్పారు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాల ప్రభావానికి మన రూపాయి ఏదైనా ఇతర కరెన్సీల కన్నా మెరుగ్గా నిలదొక్కుకుంటోందని ఆమె చెప్పారు. సందర్భాన్ని అర్థం చేసుకోవాలని, భారతీయ రూపాయి గురించి మాట్లాడాలని నిర్మలా సీతారామన్ సభ్యులను కోరారు. 
 
అంతకుముందు టీఎంసీ ఎంపీ లుయిజిన్హో ఫెలీరో మాట్లాడుతూ, గడచిన ఆరు నెలల్లో రూపాయి విలువ 28 సార్లు పతనమైందని, 34 శాతం తగ్గిందని చెప్పారు. జూలై మొదటి పక్షం నాటికి విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 572 బిలియన్ డాలర్లకు క్షీణించాయని తెలిపారు. 
 
కాగా,  ధరల పెరుగుదల గురించి ప్రభుత్వం తిరస్కార ధోరణిని ప్రదర్శిస్తోందన్న ప్రతిపక్షాల వాదనను ఆర్ధిక మంత్రి తోసిపుచ్చారు. ద్రవ్యోల్బణం లేదని తాము చెప్పడం లేదని అంటూ, అయితే భారతీయ రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల ద్రవ్యోల్బణం రేటు 7 శాతం వద్ద ఉందని ఆమె తెలిపారు. 
ద్రవ్యోల్బణం పెరుగుతున్న విషయాన్ని గుర్తించాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు మంగళవారం డిమాండ్ చేశాయి. ధరల పెరుగుదల ప్రభావం పేదలపై తీవ్రంగా ఉంటోందని తెలిపాయి. ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశాయి. దీనిపై బీజేపీ స్పందిస్తూ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం వల్ల ధరల పెరుగుదల సమస్య ఉత్పన్నమవుతోందని తెలిపింది. ఈ పరిణామాలు ఏ దేశం నియంత్రణలోనూ లేవని పేర్కొంది.
 
బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్  రాజ్యసభలో స్వల్పకాలిక చర్చలో పాల్గొంటూ, ధరల పెరుగుదల ప్రతి ఒక్కరినీ బాధిస్తోందని చెప్పారు. దీనిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి నేపథ్యంలో సరఫరాల వ్యవస్థ దెబ్బతిందని చెప్పారు. ఆహారం, ఇంధనం ధరలు పెరగడానికి ఇదే కారణమని తెలిపారు. 
 
ఇది ఏ దేశం నియంత్రణలోనూ లేని అంశమని చెప్పారు. భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ధరలు పెరిగాయని చెప్పారు. ద్రవ్యోల్బణం 7 శాతం వద్ద ఉందని, యూపీఏ ప్రభుత్వ హయాంలో మాదిరిగా రెండు అంకెల స్థాయికి చేరలేదని గుర్తు చేశారు.