కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తి కాగానే సీఏఏ అమలు

కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్  పూర్తి కాగానే పౌరసత్వ సవరణల చట్టం  అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. పార్లమెంట్ హౌస్‌లో తనను కలిసేందుకు వచ్చిన పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారికి ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. మూడో డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాగానే దీన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. 
 
పౌరసత్వ సవరణల చట్టం 2019 డిసెంబర్‌లో పార్లమెంట్ ఆమోదం పొందింది.  ఈ చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి మత హింస తట్టుకోలేక 2014 డిసెంబర్ 31 నాటికి భారత్ చేరుకున్న ముస్లిమేతరులకు అంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం లభిస్తుంది.
 
 ఈ చట్టం ప్రకారం ఏ భారతీయుడికీ పౌరసత్వం పోదని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  అయితే, సీఏఏకి వ్యతిరేకంగా గతంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.
 
ఈ నిరసనలు రాజకీయంగా ప్రేరేపితమైనవేనని అమిత్ షా విమర్శించారు. కుట్రతో రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయని మండిపడ్డారు.  ఏ ఒక్క భారతీయుడు తన పౌరసత్వాన్ని కోల్పోరని హామీ ఇచ్చారు. అయితే,  కరోనా మహమ్మారితో చట్టం అమలును కేంద్రం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.
 
గత  మే నెలలో పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయ్‌గురిలో నిర్వహించిన సభలో సీఏఏపై అమిత్‌ షా మాట్లాడుతూ దానిని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా సీఏఏ ప్రస్తావనను కేంద్ర మంత్రి  తీసుకొచ్చారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ చట్టం అమలును ప్రధానంగా బిజెపి ప్రస్తావించింది. 
 
పశ్చిమబెంగాల్‌లో బిజెపి పనితీరుతోపాటు సంస్థాగత సమస్యలపై ఈ సందర్భంగా అమిత్ షా సువేందు అధికారితో చర్చించారు. పశ్చిమబెంగాల్‌లో అధికార టిఎంసి నేతలకు, బిజెపికి మధ్య కొనసాగుతున్న రాజకీయ వివాదంపై కూడా చర్చించామని అధికారి చెప్పారు. అవినీతిపై చర్యలు తీసుకోవాల్సిన 100 మంది టిఎంసి నేతల జాబితాను ఇచ్చానని వెల్లడించారు.