నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌‌తోపాటు 12 చోట్ల ఈడీ సోదాలు

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో దర్యాప్తు ఏజెన్సీ ఈడీ మరింత దూకుడు పెంచింది. ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ కార్యాలయంతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసు  విచారణలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ప్రశ్నించిన అనంతరం ఈడీ ఈ మేరకు రంగంలోకి దిగింది. ఈ తనిఖీల అనంతరం ఆస్తులను జప్తు చేయనున్నట్లు తెలుస్తోంది

గత నెల జులైలో సోనియాని ఈడీ దాదాపు 12 గంటలు ప్రశ్నించింది. 100కు పైగా ప్రశ్నలు సంధించింది. అంతకుముందు రాహుల్ గాంధీని కూడా 5 రోజులకుపైగా 150కిపైగా ప్రశ్నలు అడిగిన విషయం తెలిసిందే.

బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా భారతీయుల వాణిని వినిపించేందుకు 1938లో అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జవహర్‌లాల్‌ నెహ్రూ ‘నేషనల్‌ హెరాల్డ్‌’ పత్రికను ప్రారంభించారు. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) సంస్థ ఆధ్వర్యంలో పత్రిక నిర్వహణ కొనసాగింది. ప్రస్తుతం యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 2016లో ఈ వార్తా సంస్థ సేవలు పునఃప్రారంభమయ్యాయి.

యంగ్‌ ఇండియన్‌ కంపెనీకి రాహుల్‌, సోనియా ప్రమోటర్లుగా ఉన్నారు. అందులో చెరో 38 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ కేవలం రూ.50 లక్షలే చెల్లించి ఏజేఎల్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన రూ.90.25 కోట్ల రుణాన్ని రికవరీ చేసే హక్కు పొందడంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి 2013లో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. సోనియా, రాహుల్‌ తదితరులు మోసంతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

గత ఏడాది ఈడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఇటివలే సోనియా, రాహుల్‌ను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, పవన్‌ బన్సల్‌ను ఇదివరకే ఈడీ విచారించింది. ఎలాంటి అవకతవకలూ లేవని,యంగ్‌ ఇండియన్‌ కంపెనీ లాభదాయక సంస్థ కాదని కాంగ్రెస్‌ అంటోంది.

ఏజేఎల్‌కు రూ.800 కోట్ల ఆస్తులు ఉన్నాయని యంగ్‌ ఇండియన్‌ లాభదాయక సంస్థ కాకపోతే దాని భూములు, భవనాలను అద్దెకు ఇవ్వడం వంటి వాణిజ్య కార్యకలాపాలు ఎలా చేపడుతోందని ఈడీ సందేహిస్తోంది.