ఆఫ్ఘన్ లో అల్‌ఖైదా చీఫ్ అల్‌ జవహరి హతం

అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని  కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపి అతడ్ని హతమార్చింది. అల్‌ జవహరి మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అల్ జవహరిని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు.

అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించేందుకు జో బైడెన్ అమెరికా సైన్యానికి గతవారం అనుమతిచ్చారు. ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన వారు డ్రోన్ దాడులు చేసి అల్‌ జవహరిని హతమార్చారు.

జవహరీ కాబూల్ నగరంలో తన కుటుంబసభ్యులతో కలిసి ఓ భవనంలో నివాసమున్నాడు. జవహరీ బాల్కనీలో ఉండగా యూఎస్ ఆర్మీ డ్రోన్ దాడితో అతన్ని హతమార్చింది. ఈ దాడిలో జవహరీ కుటుంబసభ్యులెవరూ గాయపడలేదని యూఎస్ ఆర్మీ తెలిపింది. కెన్యా, టాంజానియా దేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలపై దాడిలో జవహరీ కీలకపాత్ర పోషించాడని జో బిడెన్ చెప్పారు.

అల్‌ జవహరి మృతితో 9/11 ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని చెప్పారు. జవహరీ అమెరికా జాతీయ భద్రతకు సవాలుగా మారడంతో అతన్ని హతమార్చామని, అతని హత్యతో అల్ ఖైదా ఉనికికి తీవ్ర విఘాతం కలుగుతుందని బిడెన్ చెప్పారు.జవహరీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతోపాటు ఇతను మరణించాడని పలు సంవత్సరాలుగా పుకార్లు వినిపించాయి.

గత ఏడాది ఆగస్టులో తాలిబన్లు అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత జవహరీ కాబూల్ నగరంలో ఉన్నాడని తెలిసింది. జవహరీ కాబూల్ లో పాగా వేశాడని తాలిబన్లకు ముందే తెలుసని అమెరికా పేర్కొంది. డ్రోన్ దాడిని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ధ్రువీకరించారు. అంతర్జాతీయ విధానాలకు యూఎస్ డ్రోన్ దాడి ఉల్లంఘన అని జబిహుల్లా చెప్పారు.

పాకిస్తాన్‌లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011 మే 2న ప్రత్యేక ఆపరేషన్ నిర్వహంచి మట్టుబెట్టింది అమెరికా సైన్యం. ఇప్పుడు కాబూల్‌లో నక్కి ఉన్న అల్ జవవరిని హతమార్చింది. అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోయిన 11 నెలలకే అల్‌ఖైదా చీఫ్‌ను అంతం చేయడం ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు కీలక విజయమనే చెప్పవచ్చు. అల్ జవహరి మృతితో ఇకపై అప్గానిస్థాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశంగా ఉండబోదని బైడెన్ స్పష్టం చేశారు.

ఈజిప్ట్ సర్జన్ గా ఉన్న అల్-జవహరీ నేడు ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరిగా మారాడు.  2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల్లో దాదాపు 3 వేల మంది చనిపోగా, ఈ దాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా జవహరీని అమెరికా గుర్తించింది. ఇక అప్పట్నుంచి వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో జవహరీ పరారీలోనే ఉన్నాడు.

ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా దళాలు 2011లో హతమార్చిన తర్వాత జవహరీ అల్-ఖైదా పగ్గాలు చేపట్టాడు. అంతేకాదు జవహరీపై 25 మిలియన్ డాలర్ల రివార్డును కూడా అమెరికా ఇంతకుముందే ప్రకటించింది.