తాను కుట్రకు బలయ్యాయని అవినీతి కేసులో అరెస్టైన బెంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ (69) ఆవేదన వ్యక్తం చేశారు. పార్థా విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలు, బదిలీలు పెద్దమొత్తంలో మడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే.
పార్థాతో పాటు ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ అరెస్టయ్యారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన సోదాల్లో సుమారు రూ 50 కోట్ల నగదు, 5 కిలోల బంగారాన్ని ఇడి స్వాధీనం చేసుకుంది. అయితే అర్పిత వద్ద గల నాలుగు లగ్జరీ కార్లు కనిపించక పోవడంతో, వాటి నిండా డబ్బు ఉందన్న సమాచారంతో వాటి కోసం ఇడి గాలింపు చర్యలు చేపట్టింది.
ఈ కుంభకోణంతో ఆయన్ను బెంగాల్ ప్రభుత్వం మంత్రి పదవుల నుండి తొలగించింది. ప్రస్తుతం ఇడి అదుపులో ఉన్న ఆయన్ను మెడికల్ చెకప్ కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ తాను కుట్రలో బాధితునయ్యానని తెలిపారు. ఇటువంటి సమయంలో తనను మంత్రిపదవి నుండి, పార్టీ నుండి తొలగించడంతో దర్యాప్తు సజావుగా జరిగే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేశారు.
కాలమే తనపై తీసుకున్న చర్య పర్యవసానం ఏమిటో తెలియచేస్తుంది అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అసహనం వ్యక్తం చేశారు. కాగా, పార్థసారథి అల్లుడు డైరెక్టర్ గా ఉన్న మూడు కంపెనీల గురించి కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కారు దిగనని మొండికేసిన అర్పిత
మరోవంక, ఈ కుంభకోణంలో అరెస్టైన అర్పిత ముఖర్జీని కూడా మరోసారి ఇడి అధికారులు జోకా ఈఎస్‌ఐ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అక్కడ నాటకీయ సన్నివేశం చోటుచేసుకుంది. ఆమెను అక్కడకు తీసుకెళ్లగా కారులోంచి దిగేందుకు అర్పిత మొండికేశారు.
ఏడుస్తూ కారు దిగేందుకు నిరాకరించగా భద్రతా సిబ్బంది బలవంతంగా ఆమెను కిందకు దించారు. అయినప్పటికీ ఆమె వెళ్లేందుకు నిరాకరించడంతో ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ చాలా నాటకీయ సన్నివేశం చోటుచేసుకున్నది. కారులో ఉన్న అర్పిత బయటకు వచ్చేందుకు నిరాకరించింది.
ఏడుస్తూనే సీట్లోనే కూర్చుండిపోయింది. అయితే భద్రతా సిబ్బంది ఆమెను బలవంతంగా కారులోంచి దించారు. ఆ తర్వాత చెకప్ కోసం హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్తున్న సమయంలో ఆమె ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ వద్ద రోడ్డుమీదే బైఠాయించారు. ఆ తర్వాత ఆమెను వీల్‌చైర్‌పై తీసుకువెళ్లారు.
2011 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్థ చటర్జీ సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన వద్ద రూ.6,300 నగదు మాత్రమే ఉందని పేర్కొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ మొత్తం 23 రెట్లు పెరిగింది. ఈసారి అఫిడవిట్‌లో తన వద్ద రూ.1,48,676 నగదు ఉన్నట్లు ఆయన తెలిపారు. కానీ ఇప్పుడు అవినీతి కేసులో మంత్రి సన్నిహితుల ఇంట్లో కోట్ల రూపాయలు లభించడం గమనార్హం.
More Stories
ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?
చైనా జలవిద్యుత్ విస్తరణను సవాల్ చేస్తున్న టిబెట్ నమూనా!