యువమోర్చా నేత హత్యకు కేరళలో కుట్ర…  ఎన్ఐఎ కు అప్పగింత 

బీజేపీ యువ మోర్చా జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్‌ నెట్టారు హత్య కేసును కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏకు అప్పగించారు. హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామమని, కారణమైన సంస్థలనూ వదిలేది లేదని ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా ముఖ్యమంత్రి నిన్న హామీ ఇచ్చారు.
హత్యకు గురైన ప్రవీణ్‌ నెట్టారు కుటుంభం సభ్యులను గురువారం సాయంత్రం సీఎం బసవరాజు బొమ్మై కలిసి ఓదార్చారు. సీఎం సహాయనిధి నుంచి రూ. 25 లక్షల చెక్‌ను వారికి అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రవీణ్‌ హత్య అత్యంత హేయమని, ఇదొక ముందస్తు ప్రణాళికలో జరిగిన హత్య అని చెప్పారు. దక్షిణ కన్నడ జిల్లాలో గత పదేళ్లలో అసాంఘిక శక్తుల అకృత్యాలు పెచ్చుమీరాయని తెలిపారు. కేరళ నుంచి కూడా ఈ విధమైన అకృత్యాలకు ప్రోత్సాహం అందుతోందని ఆరోపించారు.
అంతే కాదు అవసరమైతే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అవలంభిస్తున్న విధానం తాము కూడా అమలు చేస్తామని హెచ్చరించారు. యూపీలో అల్లర్లకు పాల్పడే వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం యోగి సర్కారు విధానాన్ని పరిస్థితులను బట్టి కర్ణాటకలో కూడా అమలు చేస్తామని బొమ్మై స్పష్టం చేశారు.
మరోవైపు ఈ హత్య కేసులో కేరళ రాష్ట్రం కాసరగోడులో ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం రాత్రి సుళ్య తాలూకాలో ప్రవీణ్‌ నెట్టారు హత్య జరిగిన వెంటనే ఏడీజీపీ అలోక్‌ కుమార్‌ పర్యవేక్షణలో ఆరు ప్రత్యేక బృందాలు హంతకుల వేట చేపట్టాయి. హత్య కేసులో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న షఫీక్‌ బెళ్లారె, జాకీర్‌ సవణూరును కేరళ రాష్ట్రం కాసరగోడు పట్టణంలో అరెస్టు చేసినట్లు ఏడీజీపీ అలోక్‌ కుమార్‌ బెంగళూరులో ప్రకటించారు.
ఈ కేసులో ఇప్పటిదాకా 21 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వీరిలో 7 మంది ఎస్‌డీపీఐకి చెందిన కార్యకర్తలున్నారు. ప్రవీణ్‌ నెట్టారు హత్య పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పనేనని, ఆ సంస్థను నిషేధించాలంటూ తాము కేంద్రానికి నివేదిస్తామని సీఎం బొమ్మై చెప్పారు.
హత్య కేసును ఏడీజీపి అలోక్‌కుమార్, పశ్చిమ విభాగం ఐజీ దేబజ్యోతి, ఎస్పీ రుషికేశ్‌ సోనావణెతో పాటు సీనియర్‌ అధికారులు గురువారం సమీక్షించారు. సీఐడీ ఎస్‌పీ అనుచేత్, హాసన్‌ ఎస్‌పీ హరిరామ్‌ శంకర్‌లను మంగళూరుకు పిలిపించి సమాచారం తీసుకున్నట్లు అలోక్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు.
హత్య జరిగిన సుళ్య దగ్గరి బెళ్లారెలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. దక్షిణ కన్నడ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితి ఉండగా, పలుచోట్ల పోలీసు కవాతులు జరిగాయి. హతుని తల్లిదండ్రులు శేఖర పూజారి, రత్నావతి, భార్య నూతన్‌లను అలోక్‌కుమార్‌ కలిసి పలు వివరాలను సేకరించారు.
కాగా ప్రధాన నిందితుడు బెళ్లారె బూడు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు తెలిపారు. ప్రవీణ్‌ హత్యకు కేరళలో కుట్ర జరిగిందని, ఇటీవల బెళ్లారెలో కేరళ యువకుని హత్యకు ప్రతీకారంగా  ప్రవీణ్‌ను హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన బైకు కేరళ రిజిస్ట్రేషన్‌దని తెలిసింది.
నిందితులు వినియోగించిన మొబైల్‌ నంబర్లను ట్రాక్‌ చేసి ఆచూకిని పసిగట్టినట్లు డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ తెలిపారు. హత్య తరువాత నిందితులు కేరళకు పరారయ్యారు. వారిని అరెస్ట్‌ చేయడానికి కేరళ డీజీపీతో మాట్లాడినట్లు తెలిపారు.  ఇలా ఉండగా, ప్రవీణ్‌ కుటుంబానికి పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు రూ.25 లక్షల పరిహారం ఇస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి అశ్వర్థనారాయణ తెలిపారు. బెంగళూరులో మాట్లాడుతూ ఇంటిని నిర్మించి ఇస్తామని చెప్పారు.