అస్సాంలో మరో ఉగ్ర కుట్ర భగ్నం … 11 మంది అరెస్ట్

ఈశాన్య రాష్ట్రాల్లో మరో ఉగ్ర కుట్నను పోలీసులు భగ్నం  చేశారు. ఆల్‌ ఖైదాతో పాటు గ్లోబల్‌ టెర్రర్‌ సంస్థలతో సంబంధం ఉన్న ఆరోపణపై అస్సాంలో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అన్సరుల్లా బంగ్లా టీమ్‌ తో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 
 
ఇటీవల బీహార్‌ లో పిఎఫ్‌ఐ ఉగ్రకుట్రను పోలీసులు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఒకరు అస్సాంలో మదర్సాగా పనిచేస్తున్నారు. 
 
అస్సాంలోని మోరిగావ్‌, బార్పేట, గువహటి , గోల్‌ పురా జిల్లాల నుండి వీరిని అదుపులోకి తీసుకున్నామని, చట్టప్రకారం వీరిపై చర్యలు తీసుకోనున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ముస్తపా అలియాస్‌ ముఫ్తీ ముస్తాఫా మోరిగావ్‌ జిల్లాలోని సహారియా గావ్‌ నివాసి.. ఇతడు అన్సరుల్లా బంగ్లా టీంలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడు. 
 
ఇతను మదరసాలో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ.. నిధులు సమకూరుస్తున్నాడనే అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ఇతనితో పాటు అఫ్సరుల్లా భుయాన్‌, అబ్బాస్‌ అలీ, మోహబూబుర్‌ రెహమాన్‌, జుబైర్‌ ఖాన్‌ , రఫీకుల్‌ ఇస్లాం , దేవాన్‌ హమీదుల్‌ ఇస్లాం , మొయినుల్‌ హక్‌ , కాజీబుర్‌ హుస్సేన్‌, ముజిబౌర్‌ రెహమాన్‌, షాహనూర్‌ అస్లాం, సహజహాన్‌ అలీని అదుపులోకి తీసుకున్నారు. 
 
నిందితుల నుండి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర నిఘా ఏజెన్సీలు, అస్సాం పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ లో ఈ ఉగ్ర మాడ్యుల్‌ బయటపడిందని స్పెషన్‌ డీజీపీ జీపీ సింగ్‌ వెల్లడించారు.