
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్, పవన్ ఖెరా, నెట్ట డిసౌజాలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారంనాడు సమన్లు పంపింది. స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెపై సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు, రీట్వీట్లు, పోస్ట్‌లు, వీడియోలు, ఫోటోలు తొలగించాలని వారిని ఆదేశించింది.
ఆగస్ట్ 18న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు పేర్కొన్న సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను 24 గంటల్లోగా ప్రతివాదులు అమలు చేయడంలో విఫలమైతే ఈ కేసులో సోషల్‌మీడియా లేదా ట్విటర్ సంస్థ ద్వారా వాటిని తొలగించాల్సి వుంటుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
కాంగ్రెస్ నేతల ట్వీట్ల ద్వారా పిటిషన్దారు పరువుకు భంగం వాటిల్లిందని విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ మణి పుష్కర్ణ అభిప్రాయపడ్డారు. నిజానిజాలు తెలియకుండానే ఆరోపణలు చేసినట్లు అర్థమవుతోందని చెప్పారు. తనపైన, తన కుమార్తె పైన నిరాధార ఆరోపణలు చేశారంటూ రూ.2 కోట్లకు స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేతలపై సివిల్ డిఫమేషన్ కేసు వేశారు.
కాగా,వాస్తవాలను కోర్టు ముందుంచేందుకు ఎదురు చూస్తున్నామని, స్మృతి ఇరానీ ఆరోపణలను సవాలు చేస్తామని, నిరూపిస్తామని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. మరోవంక, కాంగ్రెస్ నేతల వైఖరిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పౌరులైనా, ఒక హోదాలో ఉన్న వారిపై కించపరిచే ఆరోపణలు చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని చురకలంటించారు.
స్మృతి ఇరానీ కూతురు (18) గోవాలో ఎలాంటి అనుమతులు లేకుండా బార్ నిర్వహిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి తన కూతురు ఎలాంటి వ్యాపారాలు చేయడం లేదని చెప్పారు. తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన జైరాం రమేష్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాలపై పరువు నష్టం దావా వేశారు.
గోవాలో బార్ల విషయంలో తన కూతురుపై ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ కోరారు. ఈ విషయాన్ని లీగల్ నోటీసుల్లో కూడా పేర్కొన్నారు. అలాగే, రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని మంత్రి స్మృతి ఇరానీ తన పరువు నష్టం దావాలో డిమాండ్ చేశారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు