మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టుపై మమతా మౌనం ఎందుకు?

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వాణిజ్య , పరిశ్రమల మంత్రి, సన్నిహితుడు పార్థ ఛటర్జీ అరెస్టుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకని మౌనం  పాటిస్తున్నారని బిజెపి ప్రశ్నించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో స్కూల్ సర్వీస్ కమిషన్‌లో జరిగిన రిక్రూట్‌మెంట్ అవకతవకలకు సంబంధించి ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్టు చేసింది.

పశ్చిమ బెంగాల్ బిజెపి కో-ఇంఛార్జి అమిత్ మాల్వియా ట్వీట్ చేస్తూ, “మమతా బెనర్జీ… తన సన్నిహితుడు, ఇప్పుడు జైలులో ఉన్న పార్థ ఛటర్జీపై మౌనంగా ఉన్నారని, అతడి నేరం అంగీకరించడం తప్ప మరే విధంగాను ప్రతిస్పందించలేదు. ఆమె ఒక పోలీసు అధికారిని రక్షించడానికి రోడ్డుపైకి వచ్చారు. కానీ తన సన్నిహితుడి అరెస్టు విసయంలో ఆమె దూరం పాటిస్తున్నారు. వారిద్దరి మధ్య ఉన్న సానిహిత్యం అందరికీ బాగా తెలిసిందే’’ అంటూ ఎద్దేవా చేశారు. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ “మంచి ప్రణాళికతో, మమతా బెనర్జీ కేంద్ర చట్ట అమలు సంస్థలను, దాని సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకుని అసత్యాలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా ఆమె రాజకీయ, ఆర్థిక నేరాలు వెల్లడి కావు. ఇది మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవినీతి, కుంభకోణాల కేసులను మూసివేయడానికి ఇదో ఎత్తుగడ’’ అని ఆరోపించారు. 

బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ ‘‘మమతా బెనర్జీ తనకు అన్నీ తెలుసని అంటారు. అయితే తన మంత్రులు ఏం చేస్తున్నారో మాత్రం ఆమెకు తెలియదు’’ అని పేర్కొన్నారు.