మూలాలను మర్చిపోరాదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ యువతకు హితవు చెప్పారు. ప్రకృతి మాత తీవ్ర వేదన చెందుతోందని, వాతావరణ సంక్షోభంతో పుడమి భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేయనున్న కోవింద్ ఆదివారం జాతి నుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు.
21వ శతాబ్దాన్ని ‘భారత శతాబ్దం’గా మార్చడానికి దేశం సన్నద్ధమవుతోందని పేర్కొంటూ ఆరోగ్య సంరక్షణ, విద్యతోపాటు ఆర్థిక సంస్కరణలు పౌరులు తమ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు, ఆనందంగా ఉండేందుకు సాయపడతాయని తెలిపారు. కాలుష్యపు తాకిడితో ప్రకృతి మాత తల్లడిల్లుతోందని, వాతావరణ సంక్షోభం ఈ మొత్తం భూగోళం ఉనికికి ముప్పు తెస్తుందని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు.
మనకు మూడు ఆదర్శాలు ఉత్తమ దిశకు నడిపిస్తాయిని చెబుతూ స్వేచ్ఛ, సమానత, సౌభాతృత్వం త్రివిధ ఆదర్శాలుగా నిలిచాయని గుర్తు చేశారు. వీటిని బలహీనతల చిహ్నంగా భావించుకోరాదని హెచ్చరించారు. వీటితోనే అభ్యున్నతికి వీలు ఏర్పడుతుందని తెలిపారు.
“మన చరిత్ర ఆధునిక కాలంలోనూ, ప్రాచీన దశల్లోనూ మన మూడు సలక్షణాల ఘనతలను ఘటనల వారిగా నిరూపించాయి. అవే వాస్తవికతలని తేల్చాయి. వివిధ కాలాలలో వీటిని మనం గుర్తించి బలోపేతానికి యత్నిస్తూ వచ్చాం. మన పూర్వీకులు, ఆధునిక దేశ వ్యవస్థాపకులు కూడా మనకు న్యాయం, స్వేచ్ఛ, సమానతలను సౌభాతృత్వాన్ని చాటి చెప్పారు. శ్రమించే తత్వం, సేవాగుణం వంటివి మనకు గోచరిస్తూ వచ్చాయి. ఇప్పుడు మనం ఆ అడుగుజాడల్లో నడిస్తే సరిపోతుంది” అని రాష్ట్రపతి తెలిపారు.
‘కరోనా మహమ్మారి దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక వనరులను మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కల్పించింది. ప్రభుత్వం కూడా ఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరం. అదేవిధంగా, యువజనులు తమ ఘనమైన వారసత్వాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడానికి జాతీయ విద్యా విధానం దోహదపడుతుంది. యువత మూలాలను మరువరాదు’ అని కోరారు.
‘మన పిల్లల కోసం దైనందిన జీవితంలో అవకాశమున్నంత మేర చెట్లు, నదులు, సముద్రాలు, పర్వతాలు, ఇతర జీవరాశుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రథమ పౌరుడిగా, నా తోటి పౌరులకు ఒక సలహా ఇవ్వవలసి వస్తే అది ఇదే అయి ఉంటుంది’ అని కోవింద్ స్పష్టం చేశారు.
‘ఒక పూరింట్లో నివసించే ఒక చిన్న పిల్లాడికి దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి గురించి ఎలాంటి అవగాహన ఉండదు. కానీ, మన ఉమ్మడి విధి రూపకల్పనలో ప్రతి పౌరుడు పాలుపంచుకునేలా మార్గాలను సృష్టించడమే దేశ ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం’ అని చెప్పారు.
పరూంఖ్ గ్రామానికి చెందిన కోవింద్ ఈ రోజు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడం ప్రజాస్వామ్య వ్యవస్థల శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో తనకు సమాజంలోని అన్ని వర్గాల సహకారం, మద్దతు, ఆశీస్సులు లభించాయని చెప్పారు.
`డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్, డాక్టర్ అబ్దుల్ కలాం వంటి మహామహుల వారసుడిననే స్పృహతో శాయశక్తులా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాను’ అని తెలిపారు. రాష్ట్రపతి కోవింద్ కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం విందు ఇచ్చారు. విందులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, పలువరు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

More Stories
ఈ ఏడాది బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తాను… షేక్ హసీనా
రామ మందిర విరాళాల చోరీలో ఆభరణాలు, నగదు స్వాధీనం
‘రాహుల్‌గాంధీ కనబడుటలేదు’ .. ఢిల్లీలో పోస్టర్ల కలకలం