ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు టీఎంసీ ఊహించని షాక్

ఉపరాష్ట్రపతి ఎన్నికలు  ఆగస్ట్ 6న జరగనున్న తరుణంలో విపక్ష అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు టీఎంసీ  ఊహించని షాకిచ్చింది. విపక్ష అభ్యర్థికి మమత బెనర్జీ  నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ మద్దతిస్తుందని ఆశించిన విపక్షాలకు భంగపాటు తప్పలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ  ప్రకటించారు. 
 
ఆల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంలో విపక్షాల తీరును తృణముల్ కాంగ్రెస్ బాహాటంగానే తప్పుబట్టింది. ఇదే విషయాన్ని అభిషేక్ బెనర్జీ తాజాగా కూడా ప్రస్తావించారు. టీఎంసీని పరిగణనలోకి తీసుకోకుండా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వాను ప్రకటించిన విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అభిషేక్ చెప్పారు.
అందువల్ల తాము విపక్ష అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని అభిషేక్ బెనర్జీ టీఎంసీ వైఖరిని స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ దనఖర్ పే రును ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఎంసీకి, బీజేపీకి మధ్య మరీ ముఖ్యంగా జగ్దీప్‌కు, మమతకు మధ్య ఉన్న విభేదాల గురించి అందరికీ తెలిసిందే.
ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీయే అభ్యర్థికి కూడా టీఎంసీ మద్దతు తెలిపేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికకే దూరంగా ఉండాలని తృణముల్ కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది.
ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అదే రోజున కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించి ఫలితం కూడా వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.