26 శాతం పెరిగిన కార్ల ఎగుమతులు 

ఏప్రిల్​–జూన్​ మధ్య కాలంలో దేశంలో కార్ల ఎగుమతులు 26 శాతం పెరిగాయి. లాటిన్​ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు జోరందుకున్నట్లు సియామ్​ డేటా వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో కిందటేడాది ఇదే క్వార్టర్​తో పోలిస్తే ఎగుమతులు ఊపందుకున్నాయని సియామ్​ పేర్కొంది. 
 
ఈ ఏడాది ఏప్రిల్​–జూన్​ మధ్యలో మన దేశం నుంచి 1,60,263 యూనిట్లు ఎగుమతి కాగా, అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో ఈ ఎగుమతులు 1,27,083 యూనిట్లు మాత్రమే!. ఏడాది కాలానికి చూస్తే కార్ల ఎగుమతులు ఏకంగా 88 శాతం ఎక్కువై 1,04,400 యూనిట్లకు చేరినట్లు పేర్కొంది. 
 
ఇదే కాలంలో యుటిలిటీ వెహికల్స్​ ఎగుమతులు 18 శాతం వృద్ధితో 55,547 యూనిట్లకు చేరాయని సియామ్​ వివరించింది. ఇటీవలి కాలంలో లాటిన్​ అమెరికా, ఆఫ్రికా దేశాల ఆర్ధిక వ్యవస్థలు మెరుగు పడుతుండటంతో మన దేశం నుంచి ఆ దేశాలకు కార్ల ఎగుమతులు పెరుగుతున్నాయని సియామ్​ డైరెక్టర్​ జనరల్​ రాజేష్​ మీనన్​ చెప్పారు. 
 
ఎగుమతులలోనూ మారుతి సుజుకి టాప్​ ప్లేస్​లో నిలుస్తుండగా, హ్యుందాయ్​ రెండో ప్లేస్​లోను, కియా మూడో ప్లేస్​లోనూ నిలిచాయి. మారుతి తన కార్లను లాటిన్​ అమెరికా, ఏసియాన్​, ఆఫ్రికా, మిడిల్​ ఈస్ట్​ దేశాలకు ఎగుమతి చేస్తోంది. బాలెనో, డిజైర్​, స్విఫ్ట్​, ఎస్​–ప్రెస్సో, బ్రెజా మోడల్స్​ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.