తెలంగాణ ప్రభుత్వం విజ్ఞాపన అందక పంపని కేంద్ర నిధులు 

వారం రోజులకు పైగా కురిసిన భారీ వర్షాలతో గోదావరి నదికి వచ్చిన వరదల కారణంగా కకావికలమైన  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలనుఆదుకోవడానికి  మొదటి విడత ఎస్డీఆర్ఎఫ్ నిధులను    కేటాయించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆ నిధుల విడుదలకు అవసరమైన విజ్ఞాపన పత్రం ఇంకా అందాక పోవడంతో కేంద్రం ఆ నిధులను ఇంకా అందించలేదు. 
 
కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి రెండు రాష్ట్రాలలో వరదల కారణంగా  ప్రజలకు, వారి జీవనోపాధికి జరిగిన నష్టం గురించి వివరించినప్పుడు ఈ విషయం బైటపడింది.  దీనిపై స్పందించిన అమిత్ షా ఆయా ప్రాంతాలలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను వీలయినంత త్వరగా అందించమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో అవసరమైన రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లను నిర్వర్తించడానికి ఇప్పటికే 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించడం జరిగిందని అమిత్ షా  స్పష్టం చేశారు. తెలంగాణ నుండి విజ్ఞాపన పత్రాలను పంపించిన వెంటనే అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందించటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మొదటి విడత నిధులను ఎన్డీఆర్ఎఫ్  నుంచి ఇప్పటికే విడుదల చేయడం జరిగిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన వెంటనే రెండో విడత నిధులకు సంబంధించిన కేటాయింపులు జరిపి, నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రాథమిక నివేదిక అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వ బృందాలను పంపి జరిగిన నష్టం అంచనా వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది.