`క్లౌడ్ బరస్ట్ కుట్ర’ జరిగిందంటూ సీఎం కేసీఆర్ ఆధారాలు లేకుండా మాట్లాడారని మండిపడుతూ, ఒక వేళ ఆ విధంగా జరిగిన్నట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని మాజీ ఎంపీ, బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలా చేస్తే అందరికీ స్పష్టత వస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల సందర్భంగా ఆదివారం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడుతూ గోదావరి వరదలుల చూస్తుంటే విదేశాల నుంచి క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందేమోనన్న అనుమానం కలుగుతోందని చెప్పారు. గతంలో లద్దాక్‌లో, ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి వరదలే చోటుచేసుకున్నాయని తెలిపారు.
క్లౌడ్ బరస్ట్‌పై కొండా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ క్లౌడ్ బరెస్టు జరిగితే 100 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని కొండా చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆ కుట్ర పాకిస్థాన్ వాళ్లు చేశారా? లేక చైనా వాళ్లు చేశారో చెప్పాలని కొండా డిమాండ్ చేశారు. రాకెట్స్, విమానం ద్వారా క్లౌడ్ బరస్ట్ చేయాలంటే వాళ్లకు భారత్ లో రహస్యమైన ఎయిర్ బేస్ ఉండాలని పేర్కొంటూ అదెక్కడ ఉందో సీఎం కేసీఆర్ చెప్పాలని స్పష్టం చేశారు.
క్లౌడ్ బరస్ట్ కు ఉపయోగించిన ఎయిర్బేస్ గజ్వేల్ లోనే ఉండి ఉంటందని కొండా విశ్వేశ్వర రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటి కైనా క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటో తెలుసుకొని చెప్పాలని ఆయన హితవు చెప్పారు. లద్ధాఖ్ లో అది సాధ్యమే అయినా నిజంగా అక్కడ జరిగిందా లేదా అన్నది తనకు తెలియదని కొండా చెప్పారు.
కాళేశ్వరంతో ఫ్లడ్ కంట్రోల్ అవుతుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రిజర్వాయర్ కట్టకుండా నీళ్లను ఎక్కడా పంప్ చేస్తారని నిలదీశారు. కొండ పోచమ్మ సాగర్ ఇప్పటి వరకూ నింపారా? అని నిలదీశారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆ ప్రాజెక్టు డిజైన్ చేసిన విధానం సరిగ్గా లేదని తేలిపోయిందని ఆయన వెల్లడించారు. మూడేళ్లు కాకముందే కొండ పోచమ్మ లీకేజీ అవుతోందని విమర్శించారు.

More Stories
జూబ్లీ హిల్స్ లో ఓట్ల చీలికతో బీజేపీ ‘కింగ్’
సెల్, జీన్ థెరపీ రంగంలో భారత్ బయోటెక్
హోమ్ శాఖ కోసం పట్టుబడుతున్న అజారుద్దీన్!