దేవాలయాల డిపాజిట్లుపై జగన్ సర్కార్ కన్ను

తన ప్రభుత్వంపు రోజువారీ ఖర్చుల కోసం హిందూ దేవాలయాల నిధులను దుర్వినియోగం చేస్తూ వస్తున్న ఏపీలోని వై  ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఆలయాల పేరుతో బ్యాంకులలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లపై పడింది. ఫిక్సిడ్ డిపాజిట్లను రద్దు చేయమని ఎండోమెంట్స్ కమీషనర్ ఆదేశాలు జారీ చేయడం కలకలం సృష్టిస్తున్నది.
 
ఇప్పటికే, జులై నెలలో 13వ తేదీ వరకు రూ 45 కోట్ల డిపాజిట్ లను వివిధ దేవాలయాల కార్యనిర్వహణ అధికారులు రద్దుచేశారు. మొత్తంగా రూ 500 కోట్ల మేరకు  ఆ  విధంగా డిపాజిట్ లను రద్దు చేయాలనీ దేవాదాయశాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. 
పైగా, ఆ విధంగా బ్యాంకుల్లో రద్దు చేసిన ఎఫ్ డిల నగదును సిజెఎఫ్ కు ఆలయ అధికారులు జమ చేస్తున్నారు. వాస్తవానికి  సిజిఎఫ్ నిధులను ఆలయాల జీర్ణోనోద్దారణకు ప్రభుత్వం వినియోగించాల్సి ఉంది.  అయితే ప్రస్తుత ప్రభుత్వంలోని మాజీ దేవాదాయశాఖ మంత్రి సిజిఎఫ్ నిధులను ఇష్టానుసారం బదలాయించి ప్రభుత్వ ఖర్చులకోసం వాడుకొంటూ వచ్చారు.
ఇప్పుడు కూడా ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే ఎత్తుగడ స్పష్టమవుతుంది. ఈ విధంగా అర్ధాంతరంగా ఫిక్సిడ్ డిపాజిట్స్ రద్దు చేయడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. దీనివల్లనే ఆలయాలు దీపదూప నైవేద్యాలకు సైతం ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 రాష్ట్రంలో సుమారు 15 వేల దేవాలయాలలో ఎఫ్ డిలు రద్దుకు రంగం సిద్దమైన్నట్లు తెలుస్తున్నది. రోజువారీ ఆలయాలలో వెంటపడి మరీ ఫిక్స్డ్ డిపాజిట్ రద్దుపై  దేవాదాయ శాఖ అధికారులు దృష్టి సారించారు.   సిజిఎఫ్ పేరుతో ఆలయాల ఆదాయాలపై కన్నెసిన, గతంలో ఏసీబీకి పట్టుబడిన ఓ ఎండోమెంట్ ఉన్నతాధికారి ఆలోచనతోనే జగన్ ప్రభుత్వం ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తున్నది.
 
తూర్పుగోదావరి జిల్లా అయినవల్లి వినాయక ఆలయం లో రూ 30 లక్షలు, నెల్లూరు జిల్లా మూలస్ధానేశ్వరస్వామి ఆలయంలో రూ 30 లక్షలు, సింగరాయపాలెం సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో రూ  20 లక్షలు, విజయవాడ యనమలకుదురు శివాలయంలో రూ 30 లక్షలు,
వేదాద్రి యోగానంద లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో రూ 60 లక్షలు, ఎన్టీఆర్ జిల్లా కోటిలింగాలు ఆలయంలో రూ  40 లక్షలు చొప్పున ఎఫ్ డి లను రద్దు చేసిన్నట్లు తెలుస్తున్నది.